BJP Operation Lotus : రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ బీజేపీ ఆఫర్లు

రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస్ కు రాహుల్ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారా? అనేదే ఆసక్తిగా మారింది.

BJP Operation Lotus : రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ బీజేపీ  ఆఫర్లు

bjp operation lotus

BJP Operation Lotus : బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఎనిమిదేళ్లలో ఆ పార్టీ గెలిచిన వాటి కంటే.. కూల్చిన ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయ్. బీజేపీ కన్నేసిన రాష్ట్రాల్లో.. అక్కడున్న ప్రభుత్వాలు కుప్పకూలిపోతున్నాయ్. నిజానికి.. అవన్నీ మెజారిటీతో పాలన చేస్తున్నవే. అయితే.. బీజేపీ మొదలుపెట్టిన ఆపరేషన్ లోటస్‌తో.. ఆయా ప్రభుత్వాలు కూలిపోయాయ్. ఇప్పుడు కమలదళం ముందున్న లాంగ్ టర్మ్ గోల్ ఒక్కటే. అదే.. వన్ నేషన్.. వన్ నేషనల్ పార్టీ. అది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. దాని కోసమే.. ఇదంతా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

దీని కోసమే.. కాంగ్రెస్‌ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని చూస్తోంది బీజేపీ. ఎక్కడ బలంగా ఉంటే.. అక్కడికి వెళ్లి కొడుతోంది. రాహుల్ జోడో అంటుంటే.. బీజేపీ తోడో అంటోంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. అక్కడ ఫోకస్ చేసి.. ఎలాగోలా ఆ ప్రభుత్వాన్ని కూలుస్తోంది. దేశంలో కాంగ్రెస్‌కున్న కాస్తో.. కూస్తో.. ఎమ్మెల్యేలకు కూడా ఆపరేషన్ లోటస్‌తో.. కాషాయ పార్టీలోకి లాగేస్తున్నారు. హస్తం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులనే కాదు.. ఆ పార్టీలో ఉన్న కీలక నేతలను, సీనియర్ లీడర్లను కూడా కమలదళంలో చేర్చుకుంటున్నారు.

Operation Lotus In Goa : గోవాలో ఆపరేషన్ లోటస్ .. బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా మార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో.. అన్ని రకాలుగా ట్రై చేస్తోంది బీజేపీ నాయకత్వం. వన్ నేషన్.. వన్ నేషనల్ పార్టీ అనే టార్గెట్‌తో ముందుకెళుతోంది కమలదళం. దేశంలో అత్యంత పెద్ద జాతీయ పార్టీగా బీజేపీని నిలపాలనే ఉద్దేశంతో.. రాజకీయంగా అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ పొలిటికల్ దుకాణం బంద్ చేయాలన్న బలమైన సంకల్పంతో.. బీజేపీ నేతలున్నారు. ఎక్కువ రోజులు పాలించడం వల్ల.. తమ సర్కార్‌పై వ్యతిరేకత తలెత్తితే.. దేశ ప్రజలకు కనిపించే మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే. దానినే లేకుండా చేస్తే.. భారత ప్రజలకు మరో ఆప్షన్ లేకుండా పోతుంది. విపక్షాలన్నీ ఏకమైనా.. కాంగ్రెస్ స్థాయికి చేరలేవనేది బీజేపీ ఆలోచన. ఇదే జరిగితే.. తిరిగి అధికారంలోకి రావడం సులువు అవుతుందని కమలదళం భావిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అందువల్ల.. కాంగ్రెస్‌‌ని నామరూపాల్లేకుండా చేయాలని చూస్తోంది కాషాయ పార్టీ.

ముఖ్యంగా.. ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రధానంగా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని కలలుగన్న కమలం పార్టీ ఆశలకు ఆప్ గండికొట్టింది. దీంతో.. కాంగ్రెస్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లో ఆప్‌ను.. ఆపే పనిలో పడింది బీజేపీ. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో కీలకమైన ఆప్ నేతలను.. ఇప్పటికే తమ పార్టీలో చేర్చుకున్నారు. ఉత్తరాఖండ్ ఆప్ చీఫ్ దీపక్ బాలి, ఆప్ సీఎం అభ్యర్థి రిటైర్డ్ కల్నల్ అజయ్ కొథియాల్.. కొన్ని నెలల క్రితమే బీజేపీలో చేరారు. దీంతో.. ఉత్తరాఖండ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ బాగా బలహీనపడింది. హిమాచల్ ప్రదేశ్ ఆప్ అధినేత కూడా ఇతర నేతలతో కలిసి కాషాయ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇదే స్టేట్‌లో.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయారు.

Kejriwal Fired Purchase Of Goa MLAs : గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్

ఇక.. మేఘాలయాలో కాంగ్రెస్‌కు ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. గత ఫిబ్రవరిలోనే బీజేపీలో చేరిపోయారు. ఇటీవలే.. బెంగాల్‌లో పెద్ద ఎత్తున టీఎంసీ కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో.. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. అయినప్పటికీ.. అక్కడ కూడా ఆపరేషన్ లోటస్ అమలవుతోంది. ఇద్దరు కాంగ్రెస్ మాజీ నేతలు బీజేపీలో చేరారు. మరో ఆరుగురు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితమే కమలదళంలో చేరిపోయారు.

తెలంగాణలోనూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరిపోయారు. అంతేకాదు.. బండి సంజయ్‌తో పాటు మిగతా స్టేట్ బీజేపీ నేతలు కూడా అప్పుడప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కామెంట్స్ చేస్తుంటారు. సరైన సమయంలో.. వాళ్లంతా కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతుంటారు. అయితే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు.. బీజేపీ నేతల కామెంట్స్‌కి కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. అవన్నీ.. నిరాధారమైన వ్యాఖ్యలని కొట్టిపారేస్తుంది.

ప్రస్తుతం.. దేశంలో బీజేపీకి పోటీగా ఉన్నది, దేశ ప్రజలకు ఆల్టర్నేట్‌గా కనిపిస్తున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. అందుకే.. దానిని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తోంది బీజేపీ. అందుకే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టగానే.. బీజేపీ ఆపరేషన్ లోటస్ వేగంగా అమలు చేస్తోంది. రాహుల్ యాత్ర జరుగుతుండగానే.. ఆ పార్టీ నేతలను కమలదళంలో చేర్చుకుంటూ.. హస్తం పార్టీ నాయకత్వాన్ని మానసికంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే.. కొన్ని నెలల ముందే జరగాల్సిన చేరికలన్నీ.. ఇప్పుడే జరుగుతున్నాయ్. ఇందుకు.. లేటెస్ట్ గోవా ఎపిసోడే బిగ్ ఎగ్జాంపుల్. ఇక ముందు కూడా అన్ని రాష్ట్రాల్లో.. బీజేపీలోకి చేరికలు, వలసలు కొనసాగుతాయ్. వాళ్లకు ఇష్టం లేకపోయినా.. ఏదో రకంగా వాళ్లను పార్టీలో చేర్చుకునే ప్రణాళికలు, ఎత్తులు కమలదళం దగ్గర పుష్కలంగా ఉన్నాయ్. అయితే.. బీజేపీ పద్మవ్యూహాలను దాటుకొని.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెస్తారా? లేదా? అన్నదే.. ఆసక్తిగా మారింది.