విశ్లేషణ: రాజకీయ చాణక్యంలో బీజేపీకి ఎందుకు తిరుగులేదు?

విశ్లేషణ: రాజకీయ చాణక్యంలో బీజేపీకి ఎందుకు తిరుగులేదు?

సిద్ధాంతాలను పక్కకు పెట్టి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో శివసేన జట్టుకట్టడంతో…రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ధైర్యం బీజేపీకి వచ్చింది. అలాంటప్పుడు ప్రజాసామ్య విలువలను మంటగలిపేసిందని బీజేపీని విపక్షం ఏ మాత్రం ప్రశ్నించగలదు? రాజకీయం అంటేనే…నెంబర్లాట అయిపోయినప్పుడు!

ఎన్నికల సమయంలోనే మిత్రపక్షం శివసేన మందుగుండును దట్టించింది. స్నేహపూర్వక కాల్పులు జరిపింది. బీజేపీ తట్టుకుంది. తానూ పీఠాన్ని చేపట్టాలన్న కోరికను శివసేన దాచుకోలేదు. బీజేపీ సైతం సీఎం ఫడ్నవీసేనని చెప్తూ దాటేసింది. వెనుక నుంచి రాజకీయాన్ని నడిపే థాకరే వారసుడు మొదటిసారి ఎన్నికల్లో అడుగుపెట్టి, భారీ మెజార్జీ సాధించిన తర్వాత… వచ్చే సమస్యలేంటో బీజేపీకి తెలుసు. అందుకే సీఎం పదవిని పంచుకొనేందుకు ఇష్టపడలేదు. సమీకరణాలను సరిచూసుకుంటూ…. వ్యూహానికి పదును పెడుతూనే ఉంది.
 
మహారాష్ట్ర రాజకీయాల్లో రెండో క్రిష్ణుడిగా ఉండటానికి ఇష్టపడని శివసేన… సిద్ధాంతాలను పక్కన పెట్టింది. రాజకీయంగా పి.ఎస్.యు.(పవార్-సోనియా-ఉద్ధవ్) ఎప్పుడైతే ఏర్పాటైందో బీజేపీ చురుగ్గా తయారైంది. కాంగ్రెస్‌తో శివసేన పొత్తు కుదుర్చుకోవవడం రాజకీయంగా ఒప్పు అయినప్పుడు తనను ఎవరూ వేలెత్తి చూపించలేరన్నది బీజేపీ లెక్క.

60ఏళ్ల జూనియర్ పవార్‌ను తనవైపు లాక్కొన్నప్పుడు ఎవరు ఏం అనగలరు? నిజానికి రాజకీయ చాణక్యుడిలా భావించే పవార్… ఒకవైపు శివసేనతో అధికారం అంటూనే.. బీజేపీతో సంప్రదింపులు సాగించడాన్ని ఏమనుకోవాలి? అలాంటి నేతలు మోడీకి నీతి పాఠాలు ఎలా చెప్పగలరు? రాత్రికి రాత్రే సంచలన నిర్ణయాలు తీసుకొని, అత్యంత రహస్యంగా అమలు చేయడంలో పండిపోయిన అమిత్ షా…తెల్లారడానికి ముందే.. ఫడ్నవీస్‌ను అధికారమెక్కించారు.
 
నిజమే.. ఏదో ముంచుకొచ్చినట్లు రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి తెల్లారేసరికల్లా… ప్రమాణస్వీకారం చేయించడంలో ఆత్రుతను చూస్తుంటే… ఆశ్చర్యంకన్నా.. అనుమానమే ఎక్కువ కలిగింది. రాజ్యాంగ ప్రక్రియపైనా సందేహాలొచ్చాయి. తెల్లవారుజామున రాష్ట్రపతి పాలననను ఎత్తేసే ఆర్డర్ మీద రాష్ట్రపతి కోవింద్ సంతకం చేయడమంటే…. రాత్రంతా అధికార వ్యవస్థ సీక్రెట్ గా పని చేసినట్లే లెక్క. అంత అవసరమేముంది? ఇదేమీ అత్యవసర పరిస్థితి కాదు కదా. ఇది విపక్షాల ప్రశ్న.

నిజానికి సెప్టెంబర్ లో ఎన్నికలను ప్రకటించినప్పుడు బీజేపీకి తిరుగులేదని అందరూ అనుకున్నారు. మెజార్టీ మార్క్‌కు దగ్గరకు వచ్చేస్తామని బీజేపీ అనుకుంది. తీరా చూస్తే… ఉన్న బలానికి కోతపడింది. పవార్ పార్టీకి సీట్లు పెరిగాయి. కాంగ్రెస్ నిలదొక్కుకుంది. శివసేనకు బేరమాడే శక్తి వచ్చింది. అందుకే… ఫిప్టీ-ఫిఫ్టీ ఫార్ములాను డిమాండ్ చేశారు ఉధ్ధవ్ థాకరే.
 
ఇంతకీ పవార్ కుటుంబంలోని ఆధిపత్య పోరే అజిత్ పవార్ బీజేపీతో కలవడానికి కారణమా? లేదంటే… 2006లో లాగా కుమారస్వామి బీజేపీతో కలవడానికి వీలుగా పార్టీని నుంచి పంపించి… ఆ తర్వాత ఇద్దరూ ఒకటైన విధానాన్ని శరద్ పవార్ పాటిస్తున్నారా? అసలు ఇదంతా పవార్ చాణిక్యమేనా? కొద్ది రోజుల్లో వీటన్నింటికి సమాధానాలు దొరకకమానవు.

రెండో సంగతి. ఇంతకీ శివసేన పరిస్థితి ఏంటి? అధికారాన్ని ఆశించి భంగపడి, దెబ్బతిన్నట్లేనా? తనను ఏమార్చి అధికారాన్ని బీజేపీ లాక్కొంటుంటే…నిస్సహాయ స్థితిలో ఉన్నట్లేనా? బీజేపీతో తెగదెంపులు చేసుకోవడాన్ని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వీళ్లందరినీ పోగట్టుకున్నట్లేనా? చీలిపోకుండా ఉద్ధవ్ పార్టీని నిలబెట్టుకోగలరా? అంతకన్నా ఎక్కువగా మహారాష్ట్ర గడ్డ మీద హిందుత్వ జెండాను ఎగరేసిన శివసేన తన మీద నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకోవచ్చు బహుశా ఈ నెలాఖరుకే తెలిసిపోవచ్చు.