బీజేపీ రథయాత్రకు బ్రేక్ : అనుమతివ్వని సుప్రీం కోర్టు

  • Published By: chvmurthy ,Published On : January 15, 2019 / 02:20 PM IST
బీజేపీ రథయాత్రకు బ్రేక్ : అనుమతివ్వని సుప్రీం కోర్టు

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న  రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే  సున్నితమైన  ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చకుండా …..రథయాత్రకు, సవరించిన రూట్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాలని జస్టిస్. రంజన్ గొగోయ్  నేతృ్త్వంలోని ధర్మాసనం బీజేపీని ఆదేశించింది. రథయాత్రకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని బీజేపీకి కోర్టు సూచించింది. 
 కాగా   రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగసభలు, ర్యాలీలు వంటివి బీజేపీ ఎక్కడైనా  నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. యాత్ర రూట్ మ్యాప్ మార్చుకుంటే అంగీకరించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర  ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ తలపెట్టిన రధయాత్రను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. 
ఇటీవలే కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ రథయాత్రలకు అనుమతి ఇచ్చింది. అయితే రథయాత్ర వల్ల మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని భావిస్తూ బెంగాల్ ప్రభుత్వం, డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. దీంతో డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ రథయాత్రకు అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలోని కూచ్ బెహార్,24 పరగణాలు, బిర్భుమ్ జిల్లాల గుండా  రధయాత్ర  చేపట్టాలని బీజేపీ మొదట రూట్ మ్యాప్ రెడీ చేసింది.