BJP Strategy: బీజేపీ గేమ్ ప్లాన్ మామూలుగా లేదు.. నివ్వెరపోతున్న పరిశీలకులు

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్‌గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.

BJP Strategy: బీజేపీ గేమ్ ప్లాన్ మామూలుగా లేదు.. నివ్వెరపోతున్న పరిశీలకులు

BJP Strategy: ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను కాషాదదళం ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు అందరిలోను ఆసక్తి రేపుతోంది. 2014లో సంకీర్ణ రాజకీయాల తలనొప్పులపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 2019లో సమర్థ నాయకత్వం అందించామని చెప్పుకుంటూ ఓట్లు కొల్లగొట్టింది. ఇప్పటికే తొమ్మిదేళ్ల పాలన పూర్తయింది. మరో ఏడాది వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. కానీ, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ నాయకత్వం విసురుతున్న సవాళ్ల నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రతిపక్షాలు.. పాత శత్రుత్వాలను పక్కనపెట్టి సమష్టిగా కాషాయపార్టీని ఢీకొట్టాలని నిర్ణయించాయి. తమ అభిమతాన్ని బహిరంగంగా చెబుతూ బస్తీమే సవాల్ అంటున్నాయి.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజే సైలెంట్‌గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. తుఫాన్ ముందు ప్రశాంతతలా.. కేంద్రంలో తనపై పోరాటానికి కాలు దువ్వుతున్న ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూద్దామన్నట్లు వెయిట్ అండ్ సీ పాలసీనే అనుసరిస్తోంది. కానీ, బీజేపీ గేమ్‌ప్లాన్ (BJP Gameplan).. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాస్టర్ మైండ్ తెలిసిన రాజకీయ పరిశీలకులు మాత్రం బీజేపీ ఎప్పుడో ఎన్నికల ప్రణాళికల అమలు చేయడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలే ఆలస్యంగా తేరుకున్నాయని.. ఇప్పటికే బీజేపీ సగం ప్లాన్ పూర్తయిందని అంటున్నారు.

ఏ ఎన్నికల్లో అయినా ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, ప్రజా వ్యతిరేకత వంటివే ప్రచార అంశాలు అవుతాయి. కానీ, 2024 ఎన్నికల్లో ఇలాంటి విషయాలేవీ ఎన్నికల ప్రచారంగా కనిపించేలా లేవంటున్నారు విశ్లేషకులు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అంటున్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇబ్బందిపెట్టే స్థితిలో లేకుండా చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీజేపీ.. ఆ పార్టీల బలహీనతలపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల్లో బలమైన నాయకుల్లో అసంతృప్తి రగల్చి ఆ పార్టీని.. ఆయా రాష్ట్రాల్లో బలహీనపరచి బీజేపీ బలపడాలనే ఏకైక ఫార్ములాతో వచ్చే ఎన్నికలకు కమలదళం సిద్ధమవుతోందని అంటున్నారు. 2019 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మోదీ, షా (Modi-Shah) ద్వయం హ్యాట్రిక్ విజయం కోసం ఓ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

హిందీ హార్డ్‌కోర్ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ నిలుస్తోంది. హిందీ ఎక్కువగా మాట్లాడే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో తప్ప మిగిలిన చోట్ల బీజేపీకి ప్రధాన తలనొప్పి కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆ పార్టీని బలహీన పరచడంలో భాగంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని తమ పార్టీలోకి చేర్చుకుందని చెబుతున్నారు పరిశీలకులు. మధ్యప్రదేశ్, పంజాబ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ఈ ప్లాన్ అమలు చేసిందని.. ఎన్నికల ముందు రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ ప్లాన్ ప్రకారమే నడుచుకుంటుందని వివరిస్తున్నారు పరిశీలకులు.

Also Read: ‘మహా’ గందరగోళం.. సీఎం కుర్చీ కోసం 2024 వరకు ఆగలేనంటున్న అజిత్ పవార్

మధ్యప్రదేశ్‌లో జోతిరాదిత్య సింధియా, పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్, అస్సాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ వంటి నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరినవారేనని గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. జోతిరాదిత్య, హిమంత్ బిశ్వశర్మ(Himanta Biswa Sarma) వంటి నేతలు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగారు. వారికి అధికారం అప్పగించకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో తమ అనుచరులతో సహా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వారు నిష్క్రమించిన తర్వాత ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటమే కాదు.. సమీప భవిష్యత్‌లో బీజేపీని ఢీకొట్టే స్థితిలో లేకుండా కాంగ్రెస్‌ను దెబ్బతీశారంటున్నారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లో జితిన్ ప్రసాద (Jitin Prasada) వంటి యువనేతలను కూడా కాంగ్రెస్‌కు దూరం చేసి తమతో కలుపుకున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా లబ్ధిపొందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Also Read: సిట్టింగులను ఎత్తేసిన బీజేపీ.. అమిత్ షా సమాధానం ఏంటంటే?

కీలు ఎరిగి వాత పెట్టినట్లు.. ప్రతిపక్షాల బలహీనతనే తన బలంగా మార్చుకోవాలని అనుకుంటోంది బీజేపీ(BJP). ఇది ఒక్క కాంగ్రెస్‌కే కాదు తనకు ఇబ్బందికరంగా మారిన ప్రాంతీయ పార్టీల విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేయాలని భావిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో ఇంతకు ముందు సువేందు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు తెచ్చిన బీజేపీ ఇప్పుడు ముకుల్ రాయ్‌ను ఆకర్షిస్తోంది. హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడాలని ఉందంటూ టీఎంసీకి హెచ్చరికలు పంపుతున్నారు ముకుల్‌రాయ్ (Mukul Roy). ఈ జాబితాలో మహారాష్ట్ర నుంచి అజిత్‌పవార్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాన విపక్ష పార్టీల్లో ముఖ్య నేతలను గుర్తించి వారిలో అసంతృప్తి అనే బడబాగ్ని రగిల్చి విపక్షాల్లో అశాంతి నింపి అదే సమయంలో తమతో కలిసి వచ్చే మిత్రపక్షానికి గాలం వేస్తుందనే బీజేపీ ప్లాన్ పరిశీలకులను కూడా నివ్వెరపరుస్తోంది.