B. L. Santhosh : కర్ణాటక కొత్త సీఎం ఈయనే!

కర్ణాటక కొత్త సీఎం బీఎల్ సంతోషన్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం.

B. L. Santhosh : కర్ణాటక కొత్త సీఎం ఈయనే!

Bl

B. L. Santhosh కర్ణాటక కొత్త సీఎంగా బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎల్ సంతోష్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా ఉన్న బీఎల్ సంతోష్ ని యడియూర్ప స్థానంలో సీఎంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సోమవారం యడియూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  రాజకీయ భవితవ్యం గురించి బీజేపీ హైకమాండ్ నుంచి ఈ సాయంత్రం ఏదైనా సందేశం (మెసేజ్) రావచ్చునని, అది అందగానే మీడియాకు తెలియజేస్తానని ఆదివారం యడియూరప్ప తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధిష్టానం నుంచి మెసేజ్ అందుతుందనే భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎడ్యూరప్ప నాయకత్వ మార్పు తథ్యమని ఊహాగానాలు మరింత బలం పుంజుకుంటున్న వేళ… ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారు.

కాగా, పూర్తి సమయం ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌గా పనిచేసిన బీఎల్ సంతోష్ .. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా మారారు. ఇటీవల కేంద్ర కేబినేట్‌ విస్తరణ సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవిలో బీఎల్ సంతోశ్‌ చాలా శక్తిమంతంగా మారారని ఆర్ఎస్ఎస్‌తో పాటు కాషాయ పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, రాత్రికి రాత్రే శక్తిమంతంగా మారడం.. కొంతమంది ఢిల్లీ పెద్దలకు నిద్రలేకుండా చేసింది. ఆయన తప్పకుండా విఫలమవుతారని సీనియర్లు కొందరు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ, పార్టీలో మరింత క్రియాశీలకంగా మారారు సంతోశ్.

దశాబ్ద కాలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలో సుపరిచితుడిగా ఉన్న బీఎల్ సంతోశ్‌ కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. దానవగెరేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్ప స్వస్థలమైన శివమొగ్గలో సేవలందించారు. దశాబ్దం క్రితం రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈయన తన మకాం బెంగళూరుకు మార్చారు. కేంద్రమంత్రి అనంతకుమార్ తో సన్నిహితంగా మెలిగారు. ప్రజా దృష్టికి దూరంగా ఉండే సంతోశ్ అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వస్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఎలాంటి పరిస్థితులోనూ ఆ భావజాలాన్ని విడవడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తెరవెనుక నుంచి పరిస్థితులను, సంక్షోభాలను నియంత్రించడాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారని తెలిపాయి. కర్ణాటక బీజేపీ ఇంఛార్జీగా ఉండి అనేక సమస్యలను సంతోశ్ పరిష్కరించారు. క్రెడిట్ తీసుకోకుండా ఎల్లప్పుడూ తక్కువ ప్రొఫైల్ ను కొనసాగించారు. పార్టీ పనితీరుపై ఆయనకు యడియూరప్పకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. చాలాసార్లు ప్రజా క్షేత్రంలో వీరి విభేదాలు బయటపడ్డినప్పటికీ సంతోశ్ మాత్రం తనపై విమర్శలు రాకుండా చూసుకున్నారు.