BJP Workers-Farmers Clash : రైతులు-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఢిల్లీ గాజీపుర్​ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

BJP Workers-Farmers Clash : రైతులు-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Delhi (3)

BJP Workers-Farmers Clash ఢిల్లీ గాజీపుర్​ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగు చట్టాల రద్దు కోరుతూ నెలలపాటు ఆందోళన చేస్తున్న రైతులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు.

ఢిల్లీ నుంచి బులంద్ షహర్ వెళ్తున్న కొత్తగా నియమితులైన బీజేపీ కార్యదర్శి అమిత్ ప్రధాన్ కి స్వాగ‌తం ప‌లికేందుకు ఢిల్లీ-ఘాజియాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానించే హిండన్ ఎలివేటెడ్ రహదారి ప్రారంభం వ‌ద్ద‌కు సుమారు 400 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. అయితే సరిగ్గా అదే ప్రాంతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి అన్నదాతలు ఉద్యమం చేస్తున్నారు. తాము నిరసన చేస్తున్న ప్రాంతం చుట్టూ బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని తిరగడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత అమిత్ కి సంబంధించిన కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు వైరల్​ అవుతున్నాయి.

అయితే ఇది రైతులపై కేంద్రం పన్నిన మరో కుట్ర అని రైతులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతకు స్వాగతం పలికే ర్యాలీ పేరిట కార్యకర్తలు ఈ గొడవ చేశారని ఆరోపిస్తున్నారు. త‌మ శాంతియుత నిర‌స‌న‌ను భ‌గ్నం చేసేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నించార‌ని సంయుక్త కిసాన్ మోర్చా ప్ర‌తినిధి జగ్తార్ సింగ్ బజ్వా తెలిపారు .బీజేపీ కార్యకర్తలే అన్నదాతలతో తప్పుగా ప్రవర్తించారని.. వాహనాలను వారే ధ్వంసం చేసుకుని రైతులను నిందిస్తున్నారని బజ్వా తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బజ్వా తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మరోవైపు, మొదట రైతులే వంద‌ల సంఖ్యలో త‌మ‌వైపున‌కు వ‌చ్చి దాడి చేశార‌ని ఘ‌జియాబాద్ బీజేపీ యూనిట్ న‌గ‌ర అధ్య‌క్షుడు సంజీవ్ శర్మ ఆరోపించారు. ప‌లువురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు గాయ‌ప‌డ్డార‌ని, ప‌లు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయ‌ని, దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. ఇక, రైతులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ విష‌యం తెలిసిన వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దిన‌ట్లు ఘ‌జియాబాద్ ఎస్పీ తెలిపారు.