Navjot Sidhu : మరో వివాదంలో సిద్ధూ..పాకిస్తాన్ వెళ్లి ఇమ్రాన్ ఖాన్ ను “పెద్దన్న”గా సంబోధించడంపై దుమారం

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకుని విమర్శల పాలైన సిద్ధూ..తాజాగా పాక్ ప్రధానిని పెద్దన్న అంటూ

Navjot Sidhu : మరో వివాదంలో సిద్ధూ..పాకిస్తాన్ వెళ్లి ఇమ్రాన్ ఖాన్ ను “పెద్దన్న”గా సంబోధించడంపై దుమారం

Imran Sidhu

Navjot Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకుని విమర్శల పాలైన సిద్ధూ..తాజాగా పాక్ ప్రధానిని పెద్దన్న అంటూ సంబోధించడంపై  రాజకీయ దుమారం రేగుతోంది.

కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర పాటు మూసివేయబడిన కర్తార్ పూర్ కారిడార్ ను బుధవారం(నవంబర్-17,2021)కేంద్రప్రభుత్వం తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. పంజాబ్ గురాదస్​పుర్ జిల్లాలోని డేరాబాబా ననక్​, పాకిస్తాన్​లోని​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను కలిపేదే కర్తార్​పుర్ కారిడార్. 4.7కిలోమీటర్లున్న ఈ కారిడార్​ ద్వారా సిక్కులు పాకిస్తాన్ లో ఉన్న తమ గురుదైవమైన గురునానక్​ దేవ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

ఈ క్రమంలో శనివారం కర్తార్​పుర్​ను సందర్శించడానికి పాకిస్తాన్ వెళ్లిన పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ..పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తనకు పెద్దన్న లాంటి వారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చొరవ వల్లే కర్తార్​పుర్​ నడవా తిరిగి తెరుచుకుందని సిద్ధూ అన్నారు. పంజాబ్ బాగుపాడలంటే వాణిజ్య కార్యకాలాపాల కోసం సరిహద్దులను తిరిగి తెరవాలన్నారు. పంజాబ్​ నుంచి పాకిస్తాన్​కు 21కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు 2100 కిలోమీటర్ల దూరం ఉన్న ముంద్ర పోర్టు నుంచి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

అయితే సిద్ధూ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధూ మాటలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఐఎస్​, బోకోహారం సంస్థలను హిందుత్వతో ముడిపెట్టిన కాంగ్రెస్​ నేతలు.. ఇమ్రాన్​ ఖాన్ ను మాత్రం పెద్దన్న అని పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. పాకిస్తాన్ ను పొగిడితే భారత్​లో ఓ వర్గం సంతోషిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తారని, కానీ అలాంటి వారు ఇక్కడ లేరనే విషయం ఆ పార్టీ తెలుసుకోవాలని హితవు పలికారు. హిందుత్వపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల తరహాలోనే సిద్ధూ మాట్లాడారని విమర్శించారు.

బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్​ అమిత్ మాలవీయ కూడా ట్విట్టర్​ వేదికగా సిద్ధూపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి ఎంతో ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పాక్ ప్రధానిని బడా భాయ్ అన్నారు. పోయినసారి పాక్ ఆర్మీ చీఫ్ భజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. సీనియర్ నేత అమరీందర్ సింగ్​ను కాదని గాంధీ సోదరులు సిద్ధూను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేముంది?అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను..బడా భాయ్ అంటూ సిద్ధూ మాట్లాడిన వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు అమిత్ మాలవీయ.

అయితే పాక్​ ప్రధానిని సోదరుడు అని సిద్ధూ పిలిస్తే తప్పేముందని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాకిస్తాన్​కు వెళ్తే మాత్రం దేశ ప్రేమికుడు అని అంటారు, సిద్ధూ వెళ్తే మాత్రం దేశ ద్రోహి అంటారా అని మండిపడ్డారు. గురునానక్ దేవ్ సిద్ధాంతాలనే తాము అనుసరిస్తామని పేర్కొన్నారు.


ALSO READ భారీ వర్షాలకు అన్నదాతకు రూ.500కోట్ల నష్టం _ Heavy Rain Damaged Farmers Crops _ Chittoor District