అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం..బీజేపీ ఎమ్మెల్యే కూడా

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం..బీజేపీ ఎమ్మెల్యే కూడా

BJP’s Lone Kerala MLA Backs Resolution Against Farm Laws నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన కేరళ అసెంబ్లీ… ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రైతుల అస‌లైన స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ప‌రిష్క‌రించాల‌ని, రైతులకు న‌ష్టం చేకూర్చేలా ఉన్న ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్రప్రభుత్వం ఉప‌సంహ‌రించుకోవాల‌ని తీర్మానంలో పేర్కొన్నారు. కాగా,కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది అగస్టులోనే పంజాబ్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

నిజానికి,కేరళ అసెంబ్లీ కూడా ఇప్పటికే అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణాం పాస్ చేసి ఉండేది. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణం పాస్ చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఇటీవల కేరళ ప్రభుత్వం చేసిన విజ్ణప్తిని మొదట గవర్నర్ మహమ్మద్ ఖాన్ తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రాష్ట్ర పరిధిలో లేని అంశంపై చర్చను చేపట్టి సమస్యకు ఏం పరిష్కారం కనుగొంటారని గవర్నర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగ్గా… ప్రభుత్వాన్ని గవర్నర్ నియంత్రించాలనుకోవడం సరికాదని సీఎం విజయన్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు గవర్నర్ మహమ్మద్ ఖాన్ అసెంబ్లీ ఒకరోజు ప్రత్యేక సమావేశానికి అనుమతినిచ్చారు.

ఇవాళ కేరళ శాసన సభలో ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ మాట్లాడుతూ… నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టమేనని చెప్పారు. వీటిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మరింత కఠిన పదజాలంతో విమర్శించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని విజయన్ తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఈ తీర్మానంలో చాలాసార్లు విమర్శించామని, ప్రత్యేకంగా ప్రధాన మంత్రిపై విమర్శలు చేయవలసిన అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఇలాగే కొనసాగితే కేరళకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫుడ్ సప్లై నిలిచిపోతే రాష్ట్రం ఆకలితో అల్లాడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.

అయితే, ఇవాళ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ అసెంబ్లీలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినప్పటికీ తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేయకపోవడంతో ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం ఏర్పడింది. అయితే,రాష్ట్ర ప్రభుత్వ తీర్మాణానికికి మద్దుతు తెలపడంపై వివాదం ఏర్పడటంతో బీజేపీ ఎమ్మెల్యే ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను తీర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని పేర్కొన్నారు.

కాగా, నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నెల రోజులకు పైగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవేవీ సఫలం కాలేదు. బుధవారం కూడా ఆరోదఫా రైతులతో కేంద్రం జరిపిన చర్చలు అపరిష్కృతంగానే ముగిశాయి. దీంతో జనవరి-4న మరోసారి రైతులతో చర్చలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.