కరోనా కలకలం, 1,305 బిల్డింగ్ లు సీజ్

కరోనా కలకలం, 1,305 బిల్డింగ్ లు సీజ్

BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమౌతున్నారు. ప్రజలు ఇలాగే..వ్యవహరిస్తే..లాక్ డౌన్ విధించడం తప్పనిసరని..అని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటిస్తారా ? లేక లాక్ డౌన్ ఎదుర్కొంటారా ? అని ప్రజలకు వెల్లడిస్తున్నారు.

ప్రధానంగా..మహారాష్ట్ర, ముంబైలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముంబైలో కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. ముంబైలో కొత్తగా 2 వేల 749 కేసులు నమోదు కావడంతో..బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అలర్ట్ అయింది. నగరంలో వేయి 305 బిల్డింగ్ లను అధికారులు మూసివేశారు. ఈ సీల్ చేసిన బిల్డింగ్ లో 71 వేల 838 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కరోనా కేసులు బయటపడడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా..సీల్ వేయడం జరిగిందంటున్నారు అధికారులు.

కరోనా కేసులు నమోదవుతుండడంతో బీఎంసీ సరికొత్త నిబంధనలు జారీ చేసింది. ఏ బిల్డింగ్ లోనైనా..ఐదుకు మించి యాక్టివ్ కేసులు ఉంటే.. ఆ భవనాన్ని సీల్ చేస్తామని, విదేశాల నుంచి ముంబైకి వచ్చేవారు కచ్చితంగా..ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉండే వారి చేతిపై స్టాంప్ వేయడం జరుగుతుందని, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా ? లేదా ? అనేది చెక్ చేయడం జరుగుతుందన్నారు. 50 మందికి మించి పెళ్లిళ్లకు హాజరు కాకూడదు. రెస్టారెంట్లు కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే పని చేయాల్సి ఉంటుందన్నారు.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే..గత 24 గంటల్లో 6 వేల 112 కొత్త కేసులు నమోదయ్యాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుం రాష్ట్రంలో 44 వేల 765 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 87 వేల 632కి చేరుకున్నాయి.