ESIC హాస్పిటల్ నిర్వాకం..కరోనాతో చనిపోయిన ఏడాది తర్వాత మృతదేహాల అప్పగింత

కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కరోనాతో చనిపోయిన ఓ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికి పైగా ఓ హాస్పిటల్ లోని మార్చురీలో కుళ్లిపోయే స్థితిలో ఉండిపోయాయి. దీంతో తమ ప్రియమైనవారిని

ESIC హాస్పిటల్ నిర్వాకం..కరోనాతో చనిపోయిన ఏడాది తర్వాత మృతదేహాల అప్పగింత

Bengaluru

Bengaluru ESIC Hospital : కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కరోనాతో చనిపోయిన ఓ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికి పైగా ఓ హాస్పిటల్ లోని మార్చురీలో కుళ్లిపోయే స్థితిలో ఉండిపోయాయి. దీంతో తమ ప్రియమైనవారిని కోల్పోయిన రెండు కుటుంబాలు ఇప్పుడు ఆ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులోని రాజాజీనగర్​ ఏరియాలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్(ఈఎస్​ఐసీ)మోడల్ హాస్పిటల్ లో గతేడాది జూన్​లో కరోనా బాధితులైన దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) చేరారు. గతేడాదే జూలై 2, 2020న వీరు మరణించారు. అయితే ఆ సమయంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతున్న నేపథ్యంలో “ఇన్ఫెక్షన్ రిస్క్”కారణంతో వారి మృతదేహాలను అప్పగించలేమంటూ కుటుంబసభ్యులకు హాస్పిటల్ సిబ్బంది మరియు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) అధికారులు తేల్చి చెప్పారు. ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు ఆ తర్వాత బీబీఎంపీ తెలియజేసింది. అయితే వాస్తవానికి ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వర్తించకుండా అలాగే మార్చురీలో వదిలేశారు.

ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం బాధిత కుటుంబాలకి మీ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉన్నాయంటూ సదరు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించింది. తాము మొదటగా నమ్మలేదని హాస్పిటల్ కి వెళ్తే అసలు విషయం తెలిసిందని సదరు బాధిత కుటుంబాలు తెలిపాయి. తమ వారి మృతదేహాలు ఆదే ఆస్పత్రిలో ఏడాదిన్నరగా ఉండిపోయాయని వారు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు జరపాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి ఏ శివరామ్ హెబ్బార్​కు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్​ సురేష్​ కుమార్ లేఖ రాశారు. ఈఎస్​ఐ హాస్పిటల్ లో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని.. బాధ్యతారాహిత్యం, అమానవీయ ప్రవర్తనకు ఇది సాక్ష్యంగా నిలుస్తోందని సురేశ్​ కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఇక,సదరు హాస్పిటల్ ఆధికారులు కూడా సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

ALSO READ Japan Travel Ban : ఒమిక్రాన్ టెన్షన్..విదేశీ ప్రయాణికులపై జపాన్ నిషేధం