రాజీవ్ ఖేల్ రత్న వెనక్కిచ్చేస్తా…రైతుల ఆందోళనకు బాక్సర్ విజేందర్ సింగ్ యద్దతు

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2020 / 03:17 PM IST
రాజీవ్ ఖేల్ రత్న వెనక్కిచ్చేస్తా…రైతుల ఆందోళనకు బాక్సర్ విజేందర్ సింగ్ యద్దతు

Boxer Vijender Singh joins farmers’ agitation నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీలో తిష్ఠ వేసిన వేలాది మంది రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. హర్యాణా, పంజాబ్‌ వైపు వెళ్లే రహదారుల్ని దిగ్బంధించారు. దీంతో గత పదిరోజులుగా నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి.



కాగా, అన్నదాతల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా. భారత స్టార్ బాక్సర్​ విజేందర్​ సంగ్ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. సింఘూ సరిహద్దుల్లో రైతుల నిరసనల్లో పాల్గొన్న విజేందర్​ సంగ్…నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలా చేయకపోతే రాజీవ్ గాంధీ​ ఖేల్​రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తాను అని అన్నారు. నూతన అగ్రి చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



మరోవైపు,సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటంతో ఈనెల 8న భారత్​ బంద్​ కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ బంద్ ​కు విపక్ష, బీజేపీ భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్​ కూడా భారత్​ బంద్ ​కు మద్దతు ప్రకటించింది. ఇక, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా భారత్ బంద్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రైతుల సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఇ్పపటికే కేంద్రానికి హెచ్చరికలు పంపారు.



ఇక, రైతులు పట్టువీడకపోవడం వల్ల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రైతుల లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు సుముఖంగా లేదని రైతు సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సవరణలు తేనున్నారు.. చట్టంలోని ఏ సెక్షన్లలో మార్పులు చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. తదుపరి చర్చలు డిసెంబరు 9న జరగనున్నాయి.