చైనా వస్తువులను నిషేధిద్దాం, ఇకపై ప్రపంచానికి భారత్ నుండే ఉత్పత్తులు, ప్రధాని పిలుపు

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 10:05 AM IST
చైనా వస్తువులను నిషేధిద్దాం, ఇకపై ప్రపంచానికి భారత్ నుండే ఉత్పత్తులు, ప్రధాని పిలుపు

ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందన్నారు. చైనా వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేధించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశీయంగానే వస్తు ఉత్పత్తి జరగాలని చెప్పారు. దేశీయ ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలన్నారు. యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మ నిర్భర్ సాధించాలన్నారు.



కరోనాపై గెలుస్తాం:
కరోనా కష్ట కాలంలోనూ మనం కొత్త దారులు వెతుక్కుందామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. మన శక్తిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలన్నారు. కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కరోనా వారియర్స్ సేవలు మరువలేనివి అని కొనియాడారు. వైద్యులు, వైద్య సిబ్బందికి జాతి తరఫున ప్రధాని మోడీ వందనాలు తెలిపారు.

మోడీ ప్రసంగం హైలైట్స్:
* నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం, ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ కార్డు
* కరోనా వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు, త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం ఉంది
* భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకురావాలి
* వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం
* మహిళల వివాహ వయసుపై త్వరలోనే నిర్ణయం
* ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి



ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితం, తొలిసారి నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలు:
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో హంగూ ఆర్బాటం లేకుండా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారు. నేటి(ఆగస్టు 15,2020) నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ ఇస్తామన్నారు.



ఆధార్‌లా హెల్త్ కార్డు:
దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఇది ఉంటుంది. ఒక వ్యక్తి తాను చేయించుకున్న వైద్య చికిత్సలు, పరీక్షలు, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ దీనిలో ఉండనున్నాయని సమాచారం. ఆధార్ లా ఈ హెల్త్ కార్డును రూపొందించే అవకాశం ఉంది. ఫార్మసీ, డాక్టర్ దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆ వివరాలన్నీ హెల్త్ కార్డులో పొందుపరుస్తారు. డాక్టర్ అపాయింట్ మెంట్, డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఇలా ప్రతిదీ హెల్త్ కార్డులో ఉంటుంది.



కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా స్వాతంత్ర్య వేడుకలు:
కొవిడ్ నిబంధనల ప్రకారం 150మంది వీఐపీలు, 4వేల లోపే అతిథులు మాత్రమే పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యారు. ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోడీ. అంతకుముందు రాజ్ ఘట్ లో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ఇది ఏడోసారి. భద్రతా దళాలు, పోలీసులతో ఎర్రకోట చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు పెట్టారు. కరోనా నేపథ్యంలో ఎర్రకోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటను పూర్తిగా శానిటైజ్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు, శానిటైజ్ చేసి పంపిస్తున్న పోలీసులు. భౌతికదూరం పాటించేలా ఎర్రకోటలో 4వేల మంది కోసం ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇచ్చారు.