మోడీ ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు’కు బ్రేక్ పడినట్టేనా? 

  • Published By: sreehari ,Published On : November 22, 2019 / 02:52 PM IST
మోడీ ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు’కు బ్రేక్ పడినట్టేనా? 

ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన,కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టును శివసేన, కాంగ్రెస్ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నాయి. భారత్‌లోనే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణవ్యయానికి మహారాష్ట్రలో ఒక లక్ష కోట్లు షేర్ ఉందని కాంగ్రెస్ సమీప వర్గాలు తెలిపాయి. 

సెప్టెంబర్ 2017లో అహ్మదాబాద్ లో ఈ ప్రాజెక్టు కోసం పీఎం మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేతో సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం కోసం జపాన్ కనీస వడ్డీ 0.1శాతంతో రూ.88వేల కోట్లు ఇచ్చింది. ‘ఒకవేళ ఈ ప్రాజెక్టు మందుకు సాగితే దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఏమాత్రం ఖర్చు చేయదు’ అని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మీడియాకు తెలిపారు.

మరోవైపు.. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే.. శివసేన, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి వాడే నిధులను రుణబాధిత రైతులకు మళ్లీంచాలని ప్లాన్ చేస్తున్నట్టు పేరు చెప్పేందుకు అంగీకరించిన సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు.