నిప్పులు కురిసే ఎర్రటిఎండల్లో కాలిపోతున్న చిట్టి పాదాలు

  • Published By: nagamani ,Published On : May 16, 2020 / 06:39 AM IST
నిప్పులు కురిసే ఎర్రటిఎండల్లో కాలిపోతున్న చిట్టి పాదాలు

మే నెల. మండు వేసవి..ఎర్రటి ఎండ. నిప్పులు కురిపిస్తున్నభానుడు. కానీ ఇవేవీ వలస కూలీలను ఆపలేకపోతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లాలనే తపన. స్వంత ఊరికి పోతే రోజుకు ఒక్కపూటైన బిడ్డల కడుపులు నింపవచ్చనే ఆశ వలస వచ్చిన కూలీలను ఎండలను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామాల బాట పట్టిస్తోంది.

ఈ ప్రయాణంలో కష్టాలే తప్ప..మరేమీ కనిపించటంలేదు. చంకలో సంచీ..మరోసంకలో పసిబిడ్డలు..నడిచే  వయస్సున్న చిన్నారులు సైతం పైన సూర్యుడు నిప్పులు కురిపిస్తూ..కాలిపోతున్న చిట్టి పాదాలతో రోడ్డు నడవలేక నడుస్తూ.. పాదాలు పూర్తి ఆన్చలేక..సగం పాదాలతో నడుస్తు..చిన్నారుల చిట్టిపాదాలు కందిపోయి..ఎర్రటి బొబ్బలెక్కతున్నా సరే..వలస కూలీల పయనం ఆగటంలేదు..కూడా తెచ్చుకున్న చెప్పులు వందల కిలోమీటర్ల దూరాలు నడవటంతో అరిగిపోయాయి. కొత్త చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు. ఆగే సయమం అంతకన్నా లేదు..అలా అలా వలస కూలీల పయనాలు సాగిపోతున్నాయి..చెప్పులు అరిగిపోయానా..కాళ్లు కందిపోయి బొబ్బలెక్కుతున్నా సరే..

   
చండీగఢ్‌లోని మలోయాకు చెందిన 10 ఏళ్ల బాలిక‌ కూడా తన తల్లిదండ్రులతో కలిసి నిప్పులు కురిపించే ఎండలో న‌డుస్తూ ముందుకు సాగుతోంది. ఇంటి నుంచి బ‌య‌లుదేరే ట‌ప్ప‌ుడు ఆమెకు చెప్పులు ఉన్నాయి. దారిలో అవి పాడ‌యిపోవ‌డంతో ఉత్త కాళ్ల‌తో న‌డ‌క సాగిస్తోంది. ధారిదేవి అనే మరో మ‌హిళ కేవలం 17 రోజుల మ‌నుమ‌డిని ఒడిలో పెట్టుకుని ఎండ‌లో ప్ర‌యాణం కొనసాగిస్తోంది.

చిన్నారి బాలుడ్ని మంచంపై పడుకోబెట్టి..ఆ మంచాన్ని మోస్తూ 10,20 కాదు ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంపాటు మంచాన్ని భుజాన మోసుకెళ్లిన వలస కూలీ ఘటన ఓ జాతీయ మీడియాకు లభ్యమైంది. పంజాబ్‌లోని లుధియానా నుంచి సొంత గ్రామం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి ఆ కుటుంబం వెళ్లాలనుకుంది. అయితే, ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయమైంది.

దీంతో అతడు నడవలేని పరిస్థితి తలెత్తింది. లుధియానాలోనే ఉంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చని చేసేదేమీ లేక ఓ మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టి కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. ఇలా వారు దాదాపు 15 రోజులు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో పలు చోట్ల ఆగి ఆహారం తిని నిద్రపోతున్నారు. వారు నడుస్తున్న సమయంలో వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు.

దీంతో వారి కాళ్లకు బొబ్బలు వచ్చాయి. వారు 15 రోజులు నడిచి యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాక పోలీసులు వారి గురించి తెలుసుకుని ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపారు. పిల్లలతో పాటు  తాము మొత్తం 17 మంది సింగ్రౌలికి కాలినడకన వెళ్తున్నామని ఆ కుటుంబం తెలిపింది.

 వలస కార్మికుల్లో ఓ మహిళ చిన్నారిని సూట్ కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్లుకుతున్న ఫొటో పై పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు పంపింది. విచారణ జరిపింది. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆగ్రా హైవేపై కాలిబాటన వెళ్తున్న వలస కార్మికుల పరిస్థితి ఇది. పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే..వలస కూలీల పయనం మాత్రం కొనసాగుతునే ఉంది.