Rajasthan : వధువుకు కన్యత్వ పరీక్ష .. వరుడు కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పెద్దలు తీర్పు

నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఇటువంటి అనాగరిక ప్రక్రియలో ఆమెపై జరిగిన అన్యాయం గురించి ఎవ్వరు పట్టించుకోలేదు.కానీ వరుడు కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. దీంతో ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా చేయని తప్పుకు కుమిలిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

Rajasthan : వధువుకు కన్యత్వ పరీక్ష .. వరుడు కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పెద్దలు తీర్పు

Rajasthan bride failed in virginity test : ఓవైపు అంతరిక్షంలో విప్లవాత్మక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై భూనివాసులు నివసించటానికి దారులు వెతుకుతున్నారు పరిశోధకులు. మరోవైపు అదే భూమ్మీద మూఢత్వ ఘటనలు జరుగుతున్నాయి. ఈ కంప్యూటర్ యుగంలో కూడా వధువుకు కన్యాత్వ పరీక్షలు చేసి పెళ్లి చేసుకునే ఘటనలు వింటుంటే ఇంకా ఏ కాలంలో ఉన్నాం? అనే అనుమానం వస్తోంది. శాంకేతికంగా భారత్ దూసుకుపోతోందని పాలకులు చెబుతున్నారు. మరోపక్క ఇంకా కన్యాత్వ పరిక్షలు చేయటం చట్టంతో పనిలేకుండా గ్రామ పెద్దలే న్యాయమూర్తుగా మారిపోయి అనాగరిక శిక్షలు విధిస్తుండటం..ఇదేనా భారతదేశంపు శాంకేతికత? ఇదే భారత్ అభివృద్ధిలో దూసుకుపోవటం అంటే అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?చర్యలు తీసుకునేది ఎవరు? చట్టమా? నీవెక్కడ? మహిళలపై అత్యాచారాలు జరిగినా నిందితులను దోషులకు నిరూపించకుండా బాధితులే మరింత బాధితులుగా మారిపోతున్న వేళ చేయని తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పుకు తల్లడిల్లిపోతోంది ఓఅతివ.

అత్యాచారానికి గురి అయ్యాను..నాపై ఓ పశువులాంటి వ్యక్తి లైంగిక దాడి చేశాడు..నాకు న్యాయం చేయమని పోలీసులకు మొరపెట్టుకున్నా అతీ గతీలేదు ఆ అభాగ్యురాలికి. అత్యాచారం చేసినవాడు దర్జాగా సమాజంలో తన కళ్లముందే తిరిగేస్తుంటే..చేయని తప్పుకు బాధితురాలు మనోవేదనతో కుమిలిపోయి కృంగిపోయిన వేదనను ఎవ్వరు పట్టించుకోలేదు. కాలం గడిచింది. ఆ బాధనుంచి కోలుకుంటున్న సమయంలో అత్యాచార బాధితురాలికి వివాహం నిశ్చయమైంది. ఈక్రమంలో అత్తింటివారు ఆమెకు కన్యాత్వ పరీక్షలు నిర్వహించారు.ఇంకేముంది? కన్యాత్వ పరీక్షలో ఆమె దోషిగా నిలబడింది. కారణం ఓ పశువులాంటి మనిషి చేసిన అత్యాచారం. దీంతో ఆమె అత్తింటివారు పదిమంది పెద్దల్లో పంచాయితీ పెట్టారు. మమ్మల్ని మోసం చేసింది కాబట్టి తమకు పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుపట్టారు. దీనికి పెద్దల వంతపాడారు. కన్యాత్వ పరీక్షలో విఫలమైంది కాబట్టి ఆమె వరుడి కుటుంబానికి రూ.10 లక్షలు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చేశారు గ్రామ పెద్దలు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. చేయని తప్పుకు నేను జరిమానా కట్టాలా? ఇదేం న్యాయం అని ఆమె మనస్సు మూగగా రోదించింది. కానీ ఆ వేదనను అర్థం చేసుకునేదెవరు? వినేదెవరు? న్యాయం చేసేదెవరు? ఇది కథకాదు రాజస్థాన్ రాష్ట్రంలో ఓ అమాయకురాలికి జరిగిన అన్యాయం.

కన్యత్వ పరీక్షలో విఫలమైందని ఓ నవ వధువును అత్తింటివారు దారుణంగా పశువుని కొట్టినట్లుగా కొట్టారు. పతితవి నువ్వు మాకొద్దు అంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా చివరికి పంచాయితీ పెట్టిన ఘటన రాజస్థాన్ లోని మేవార్‌ ప్రాంతంలోని బిల్వారా జిల్లా బాగోర్‌లో జరిగింది. ఈ ప్రాంతంలో వివాహం తర్వాత నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం ఇంకా కొనసాగుతోంది. ఈ దుర్మార్గపు పనికి ఓ పేరు కూడా పెట్టుకున్నారు స్థానికులు. దాని పేరు ‘కుకుడీ’ అంటారు. అయితే..2022 మే 11న భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువతికి, భాగోర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వారి ఆచారమైన కుకుడీ పద్దతిలో వధువుకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో అత్తింటివారు ఆమె తీవ్రంగా కొట్టి.. పుట్టింటికి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా మే 31న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు.

ఈ పంచాయితీలో బాధిత మహిళ.. పెళ్లి కాక ముందు తనపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశాడని దీనిపై తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పెద్దల ముందు మొరపెట్టుకుంది. అయినప్పటికీ.. పెద్దలు ఆమెను, ఆమె కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. బాధిత మహిళ కుటుంబం.. వరుడి కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని పెద్దలు తీర్పు ఇచ్చారు.

అయితే.. జరిమానా చెల్లించకపోవడంతో.. ఐదు నెలలుగా యువతిని అత్తమామలు వేధిస్తున్నారు. చివరకు వారి వేధింపులకు విసిగిపోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు బాగోర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం (సెప్టెంబర్ 11,2022) రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు భర్త, అత్తమామపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో నిజమేనని తేలిందని దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.