కారు పంపిన అత్తింటివారు..ఏనుగెక్కిన పెళ్లి కొడుకు… అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : August 25, 2019 / 03:42 PM IST
కారు పంపిన అత్తింటివారు..ఏనుగెక్కిన పెళ్లి కొడుకు… అరెస్ట్

కోజికోడ్: పెళ్లి చేసుకోటానికి కేరళ వచ్చిన ఎన్నారై పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆతర్వాత బెయిల్ పై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఆర్కే సమీష్ అనే ఎన్నారై పారిశ్రామిక వేత్తకు కేరళలోని చెందిన ఒక కుటుంబంతో సంబంధం కుదిరింది. సమీష్ తండ్రి అబ్దుల్లా హాజీపెద్ద పారిశ్రామిక వేత్త. ఆగస్టు 19 ముహూర్తం నిశ్చయించుకున్నారు. సమీష్ కుటుంబం పెళ్లికి కేరళలోని కోజి కోడ్ జిల్లాలోని నారిప్పట్ట గ్రామానికి పెళ్లికూతురు ఇంటికి వచ్చారు.

తమ కుమార్తె పెళ్ళిని ఘనంగా చేసే క్రమంలో వధువు తరుఫు వారు పెళ్లి కొడుకు వారికి రాచమర్యాదలతో స్వాగతం పలికి అన్నిసౌకర్యాలు కల్పించారు. ముహూర్తం సమయానికి పెళ్లికొడుకును తీసుకురమ్మని ఆగస్టు 18న ఓ ఖరీదైన కారును విడిదింటికి పంపారు ఆడపెళ్లివారు. అయితే పెళ్లి కొడుకు సమీష్ ఆ కారును పట్టించుకోలేదు. ఇండియా వచ్చే సరికి పెళ్ళి కొడుక్కి కొత్త ఆలోచన వచ్చింది.

తన పెళ్లికి గుర్తుండేలా ఏదైనా చేయాలనుకున్నాడు. తనకున్న పరిచయాలతో ఒక ఏనుగును అద్దెకు తెప్పించాడు సమీష్. అత్తింటి వారు పంపిన కారును కాదని..పెళ్లి మండపానికి ఏనుగుపై ఊరేగింపుగా చేరుకున్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక పక్క కేరళ మొత్తం వరదల్లో కొట్టుకుపోతుంటే ఇంత ఖరీదైన పెళ్లి అవసరమా అంటూ నెటిజన్లు సమీష్‌ను ప్రశ్నించారు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు. ఈ వీడియోలు చూసిన పోలీసులు రంగంలోకి దిగి వెంటనే సమీష్‌ను అతనికి సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏనుగుపై తిరగడానికి సమీష్ అనుమతి తీసుకోలేదని, అంతేకాక కొన్ని అటవీ నిబంధనలను కూడా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసిన అనంతరం వారిని బెయిల్ పై విడుదల చేశారు.