BS Yediyurappa : ఈ నెల 10నే మోదీ చేతిలో యడియూరప్ప రాజీనామా లేఖ!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.

BS Yediyurappa : ఈ నెల 10నే మోదీ చేతిలో యడియూరప్ప రాజీనామా లేఖ!

Modi Yediyurappa

BS Yediyurappa  కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 10వ తేదీనే యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అదే రోజున యడియూరప్ప సన్నిహితుడొకరు ఆ రాజీనామా లేఖను ఢిల్లీలోని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి.. మోదీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ముఖ్య బీజేపీ నేతలని కలిసిన విషయం తెలిసిందే. ప్రధానితో భేటీ సమయంలో.. తాను సీఎం పదవి నుంచి దిగిపోయేందుకు మరికొంత సమయం కావాలని.. ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రిగా తన చివరి చర్యగా జాతీయ జెండాను ఎగురువేయాలని భావిస్తున్నానని యడియూరప్ప చెప్పినట్లు తెలుస్తోంది. అయితే యడియూరప్ప ప్రతిపాదనను మోదీ సహా బీజేపీ అదిష్ఠానం తిరస్కరించిందట.

యడియూరప్ప ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే మీరు సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను యడియూరప్ప తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అధిష్ఠానం తనపై చాలా నమ్మకముంచిందని,కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయాలని తనకు సూచించిందని యడియూరప్ప సమాధానమిచ్చారు.

అయితే ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి కర్ణాటకకు చేరుకున్న మరుసటి రోజు నుంచి సీఎం పదవికి తాను రాజీనామా చేయబోతున్నాను అనే సంకేతాలను యడియూరప్ప ఇచ్చారు. అయితే ఇదే సమయంలో బీజీ షెడ్యూల్ లో ఉండి కూడా లింగాయత్ పీఠాధిపతులు సహా మతాధికారులను కలుస్తూ యడియూరప్ప.. రాష్ట్రంలో తన బలాన్ని ఢిల్లీని పార్టీ హైకమాండ్ కి తెలియజేసే ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి విధిలేని పరిస్థితుల్లోనే యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే తాను స్వచ్ఛందంగానే సీఎం పదవికి రాజీనామా చేశానని,తనపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని..కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా చేసినట్లు సోమవారం రాజీనామా లేఖను గవర్నర్ కి సమర్పించిన అనతంతరం యడియూరప్ప వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.