H Vishwanath : యడియూరప్పపై సొంత పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం యడియూరప్ప నాయకత్వంపై సొంతపార్టీ నేతల్లో అసమ్మతి కొనసాగుతున్న వేళ ఆపార్టీ నేత,ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

H Vishwanath : యడియూరప్పపై సొంత పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు

H Vishwanath

H Vishwanath కర్ణాటక సీఎం యడియూరప్ప నాయకత్వంపై సొంతపార్టీ నేతల్లో అసమ్మతి కొనసాగుతున్న వేళ ఆపార్టీ నేత,ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యడియూరప్ప సారథ్యాన్ని తాము గౌరవిస్తామని, అయితే వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ప్రభుత్వాన్ని నడిపేంత బలం, స్పిరిట్ ఆయనకు లేవని విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్‌తో పంచుకున్నారు. పార్టీ రాష్ట్ర యూనిట్ లో నెలకొన్న అసమ్మతి గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో అరుణ్ సింగ్ సమావేశమైన నేపథ్యంలో విశ్వనాథ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టారు.

యడియూర్ప సారథ్యంపై మంత్రులందరూ అసంతృప్తిగా ఉన్నారని అరుణ్ సింగ్‌తో సమావేశం అనంతరం విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. రాజవంశపాలన చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ తరచూ చెబుతూ ఉంటారని, కానీ కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోందని విశ్వనాథ్ అన్నారు. కర్ణాటక బీజేపీ మోదీని మర్చిపోయిందని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న ప్రజల అభిప్రాయాన్ని అరుణ్ సింగ్‌తో చెప్పానని విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వంలోనూ, పాలనలోనూ యడియూరప్ప కుటుంబం అదే పనిగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించిన విశ్వనాథ్.. అన్ని విభాగాల్లోనూ ఆయన తనయుడి ప్రమేయం ఎక్కువగా ఉందన్నారు. చాలా తక్కువ ధరకే ప్రైవేట్ కంపెనీలకు ల్యాండ్ ఇచ్చేశారని విశ్వానథ్ ఆరోపించారు. బోర్డు మీటింగ్ లు లేకుండానే 20వేల కోట్ల రూపాయల విలువైన ఇరిగేషన్ ప్రాజెక్టులను యడియూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.

కాగా,2019లో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి యడియూరప్ప సీఎం పదవిని అధిష్ఠించడానికి కారణమైన 18 మంది ఎమ్మెల్యేల్లో విశ్వనాథ్ ఒకరు. ఆ సమయంలో జేడీఎస్ ఎమ్మెల్యేగా విశ్వనాథ్ ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, పార్టీ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విశ్వనాథ్ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.