అందరి చూపు అటే : బడ్జెట్ ఎలా ఉంటుందో

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 12:50 AM IST
అందరి చూపు అటే : బడ్జెట్ ఎలా ఉంటుందో

న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబుల్లో ఊరట లభిస్తుందని.. ఇలా ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ప్రవేశపెట్టేది ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ కావడంతో..పెద్దగా అంచనాలు లేకపోయినా…ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం మధ్యతరగతి..పేదలను ఆకర్షించే ప్రకటనలు చేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా రైతుల కోసం రైతుబంధు తరహాలో ఓ పెద్ద పథకం ప్రకటిస్తారని అంచనా..ఇందుకోసం లక్షా 20వేల కోట్ల పద్దు కేటాయించవచ్చని అంటున్నారు..ఇక్కడ ద్రవ్యలోటుపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. దీని కోసమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.40వేలకోట్ల వరకూ డివిడెండ్ కోరినట్లు చెప్తున్నారు. 

ద్రవ్యలోటు లక్ష్యం 3.7శాతంగా పెట్టుకున్నప్పుడు కొన్ని పథకాల్లో కోత ఉండవచ్చు. అలానే ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో పన్నుల విధానంలో మార్పులు ఉండవు కానీ..కాస్త రిలీఫ్ ఇచ్చే చర్యలుంటాయని అంచనా ఉంది.. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలు ఉంది. రూ.2.5-5 లక్షల మధ్య ఆదాయానికి 5% పన్ను చెల్లించాలి. రూ.5-10 లక్షల మధ్య ఆదాయానికి 20%, రూ.10 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను చెల్లించాలి. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది. అయితే మధ్యంతర బడ్జెట్‌లో పన్ను మినహాయింపు రెట్టింపు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవాళ్లు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎఫ్ఎంసిజి వస్తువులు..ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను పోటు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయ్. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఏసీ కంప్రెస్సర్స్, మానిటర్స్..వంటి విడి భాగాలపై 10శాతం వరకూ కస్టమ్స్ డ్యూటీ పెంచే అవకాశం కన్పిస్తోంది. అంటే టీవీ, ఏసీతో పాటు మొబైల్ ఫోన్స్ ధర పెరిగే అవకాశం ఉంది. 2018 బడ్జెట్‌లో ప్రభుత్వం మొబైల్‌ఫోన్ల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీని 15శాతం నుంచి 20శాతానికి పెంచింది. దీంతోపాటు కొన్ని విడిభాగాలపై కూడా డ్యూటీలను పెంచింది. దీంతోపాటు వాషింగ్‌ మిషీన్‌లు, రిఫ్రిజిరేటర్లపై కూడా సుంకాలను పెంచారు. ఇక గ్రామీణ భారతంలోని రైతులకు ఉపశమనం కలిగించేలా..ఎరువులు, రసాయనాల ధరల్లో తగ్గింపు కానీ…సబ్సిడీలు కానీ ప్రకటిస్తారని అంచనా. 

రుణమాఫీ ఒడిశాలో అమలవుతోన్న కాలియా తరహా పథకాలు మోడీ మదిలో ఉన్నాయంటున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రకృతి విపత్తులు, మద్దతు ధరలు లభించకపోవడంతో వ్యవసాయం భారంగా మారింది. గత ఏడాది రైతులు  భారీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఆందోళన ఫలితం ఈవీఎంల్లో ప్రతిఫలించింది. దీంతో కేంద్రం కూడా రైతులను శాంతింపజేసేందుకు వారికి కనీస ఆదాయం సమకూరేలా కొత్త పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీఎస్టీ స్లాబుల్లో కూడా కీలక మార్పులు చేయవచ్చు. పెట్రోధరలను జీఎస్టీలో చేర్చే అంశంపై పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్,పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ , మహారాష్ట్ర, గుజరాత్‌లలో కొత్త రైళ్లని ప్రకటిస్తారని కూడా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లపై గతంలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌తో పాటు..లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్ విధింపుతో ఇన్వెస్టర్లను దెబ్బతీసిన కేంద్రం..ఈసారి ఆ వైపు పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చని కూడా అంటున్నారు.