Union Budget 2022 : ఈసారి రూ. 40 లక్షల కోట్ల నిధులతో కేంద్ర బడ్జెట్..! ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?

మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.

Union Budget 2022 : ఈసారి రూ. 40 లక్షల కోట్ల నిధులతో కేంద్ర బడ్జెట్..! ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?

Budget 2022 Live Updates Un

Union Budget 2022 LIVE Updates : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. సామాన్యులు, రైతులు, మధ్యతరగతి.. ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్‌లో శుభవార్తలుంటాయని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల వారీగా ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  (Nirmala Sitharaman) మంగళవారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనున్నారు. నాల్గోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ ఏయే అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్‌లో ఏయే రంగాలకు ఎలాంటి రాయితీలు ఉంటాయి అనేదానిపై ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో మొత్తం నిధులు రూ.40 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ కంటే ఈ కేంద్ర బడ్జెట్ లో మొత్తం నిధులు 14శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

కీలక రంగాలకు భారీ కేటాయింపులు.. 
కేంద్రబడ్జెట్‌లో కీలక రంగాలకు భారీ కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బడ్జెట్‌లో అత్యధిక ప్రయోజనం ఉత్పాదక రంగానికే లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతనే ఇతర సేవలు, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రికార్డు స్థాయిలో మార్కెట్‌ రుణాలను కొనసాగించడం వంటి రూ.13 లక్షల కోట్ల మేరకు నిధుల సమీకరణ జరుగుతుందని నిపుణుల అంచనా.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లోటును 6.1 శాతానికి తగ్గించవచ్చునని భావిస్తున్నారు. రక్షణ, వ్యవసాయం, రైల్వే, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలకు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఆరోగ్య రంగానికి జీడీపీలో 3 శాతం కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దేశంలో 700 జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపునిచ్చేలా పరిశ్రమ హోదా కల్పించడం, పన్ను రాయితీలు వంటి అనేక చర్యలు ఉండవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగాల కల్పన, ప్రజల ఆరోగ్య భద్రత, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం కల్పించడంతో పాటు కోవిడ్-19 కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపుల కోసం సామాన్యుల ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏడాది నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుని భారీ ఎత్తున ఆదాయ వనరులు సమకూరినట్టు ఇప్పటికే ఆర్థిక సర్వే ప్రకటించింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో..
దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచడం ద్వారా వృద్ధి రేటును పెంచాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యయాన్ని పెంచడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ది, ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల పురోగతిపై దృష్టి సారించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

మరోవైపు.. రోడ్లు, రైల్వేలు, జలవనరుల ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యలోటు తగ్గింపు, పన్నుల సరళీకరణ, సంక్షేమ కార్యక్రమాలకు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టెలికామ్, ఫార్మా, స్టీల్, టెక్స్ టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, వైట్ గూడ్స్, ఐటీ , హార్డ్ వెర్ , సోలార్ రంగాలకు కేటాయింపులను భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. ఎరువుల సబ్సిడీలు, ఉపాధి కల్పనను పెంచేందుకు, మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also : Union Budget 2022 : నాల్గోసారి నిర్మలమ్మ బడ్జెట్.. నేడు పార్లమెంట్ ముందుకు..