లాస్ట్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ : ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 12:58 AM IST
లాస్ట్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ : ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా

ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది.  తాత్కాలిక బడ్జెటేనని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. 

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు అన్ని వర్గాల్లో అంచనాలను పెంచుతున్నాయి. 16వ లోక్‌సభకు ఇవి చివరి సమావేశాలు కావడంతో ఆర్థిక సమీక్ష నివేదిక ప్రవేశపెట్టే అవకాశం లేదని సమాచారం.  ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 

ఫిబ్రవరి 13 వరకు మొత్తం 10 పనిదినాల పాటు పార్లమెంట్‌ సమావేశాలు  జరగనున్నాయి.  మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‍నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేదలకు కనీస ఆదాయం పథకంపై ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్రం ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.  పేదలకు ఆర్థికంగా భరోసా కల్పించేవిధంగా బడ్జెట్ ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గత కొన్నేళ్ళుగా ఊరిస్తున్న పన్ను శ్లాబును 5 లక్షలకు పెంచి మధ్యతరగతి ఉద్యోగులను తమవైపు తిప్పుకోవాలనే యోచనలో కేంద్రం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ బడ్జెట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాఖ్, పౌరసత్వ బిల్లు, ఎంసీఐ బిల్లు, కంపెనీ లా సవరణ చట్టాలను ఆమోదింపజేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌పై కనీసం 3 – 4 రోజులు చర్చా సమయం కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లులపై చర్చను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాఫెల్ డీల్‌పై జేపీసీ ఏర్పాటు, ఈవీఎంల పనితీరుపై వస్తున్న ఆరోపణలు, జమ్మూ కాశ్మీర్లో గందరగోళ పరిస్థితులు, మోదీ ఐదేళ్ళ పాలన వైఫల్యాలపై  కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా ఉన్న విభజన చట్టంలోని అంశాలకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావంతో తప్పులను సరిదిద్దుకొనే పనిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం- ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్ ఏవిధంగా ఉన్నా మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సంబంధిత శాఖలకు సరైన సమయంలో చేరితేనే బడ్జెట్ ఫలాలు ప్రజలకు అందే అవకాశం ఉంటుంది.