గోడలు కాదు..బ్రిడ్జిలు నిర్మించండి..కేంద్రంపై రాహుల్ సెటైర్

గోడలు కాదు..బ్రిడ్జిలు నిర్మించండి..కేంద్రంపై రాహుల్ సెటైర్

Rahul సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి-6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారటంతో సింఘు, టిక్రి సహా గాజీపుర్​ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాకుండా రహదారి మధ్యలో కాంక్రీట్​​ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు.

మొదట ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఈ విధంగా ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రైతుల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిలువరించడానికి వీటిని అమర్చినట్లు తెలుస్తోంది.

అయితే, రైతుల దీక్షా శిబిరాల చుట్టూ ఇనుప ఊచలు, సిమెంటు గోడలు నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. నిర్మించాల్సింది గోడలు కాదు.. వంతెనలు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు… రెండు వరుసల సిమెంటు బారికేడ్లు ఏర్పాటు చేసి.. వాటి మధ్య కాంక్రిట్‌తో ఇనుప ఊచలు ఏర్పాటు చేసిన ఫొటోలను ట్యాగ్‌ చేశారు.

కాగా, రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​ ఆందోళన చేస్తోన్న గాజీపుర్‌ సరిహద్దుల్లోకి ఉద్యమానికి మద్దుతుగా రైతుల దండు కదలడం వల్ల భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.