నేడు భారత్ బంద్‌.. జీఎస్టీ, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్‌

నేడు భారత్ బంద్‌.. జీఎస్టీ, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్‌

nationwide strike today : ఇంధన ధరలు, జీఎస్టీ తగ్గించాలంటూ.. నేడు దేశ వ్యాప్త సమ్మెకు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 40 వేల ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి సభ్యులు పాల్గొననున్నారు. సుమారు 8 కోట్ల మంది ఈ బంద్‌లో భాగస్వామ్యమవ్వనున్నట్లు తెలుస్తోంది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల మాదిరిగా జాతీయ రహదారులు దిగ్బంధిస్తామని ట్రేడ్‌ యూనియన్స్‌ ఇప్పటికే హెచ్చరించాయి. వీరికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

పెట్రోలియం ధరలతో పాటు ఈ-వే బిల్లు నిబంధనలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తదితర అంశాలకు వ్యతిరేకంగా వ్యాపార సమాఖ్యలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు పలు కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. దీంతో పాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం కూడా సంపూర్ణ మద్దతు పలికింది.

డీజిల్‌ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరలు ఉండాలని కోరుతూ బంద్‌ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన చక్కా జామ్‌ తరహాలో రహదారుల దిగ్బంధనం చేయనున్నారు. పెట్రోల్‌ ధర ఇప్పటికే సెంచరీ మార్క్ దాటింది. డీజిల్‌ ధరలు కూడా దీనికి పోటీ పడుతూ పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నానాటికీ పెరుగుతున్న ఇందన ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.