వీగిపోయిన అవిశ్వాస తీర్మాణం..ఖట్టర్ సర్కార్ సేఫ్

వీగిపోయిన అవిశ్వాస తీర్మాణం..ఖట్టర్ సర్కార్ సేఫ్

Haryana Assembly హర్యానా ప్రభుత్వంపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మనోహర్​ లాల్​ ఖట్టర్​ సర్కార్​ తన బలాన్ని నిరూపించుకుంది. అవిశ్వాస తీర్మాణంపై ఇవాళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత..స్పీకర్ ఓటింగ్ ను నిర్వహించారు. అసెంబ్లీలో ప్రస్తుతం 88 సభ్యులుండగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది ఎమ్మెల్యేల ఓటు వేశారు. వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు వచ్చాయి. ఓటింగ్​ అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్​ ప్రకటించారు.

కాగా, హర్యాణాలో అధికార బీజేపీ-జేజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్​.. అవిశ్వాస తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టింది. ఇటీవల ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకీ మద్దతు ఉపసంహరించడం వల్ల బీజేపీ మెజార్టీ పడిపోయిందని కాంగ్రెస్​ వాదిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్​ జ్ఞాన్​చంద్​ గుప్తా ఆమోదించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ ముందునుంచి​ చెప్పినట్లుగానే తమ బలాన్ని నిరూపించుకున్నారు.

కాగా,అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణంపై చర్చ సమయంలో సీఎం ఖట్టర్ మాట్లాడుతూ..నో కాన్ఫిడెన్స్(అవిశ్వాసం)కాంగ్రెస్ సాంప్రదాయం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..ఈవీఎంలపై విశ్వాసం లేదు,సర్జికల్ స్ట్రైయిక్స్ కి ఫ్రూఫ్ లు అడుగుతారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే అంతా బాగుంటుంది. అదే బీజేపీ అధికారంలో ఉంటే వారికి ఏదీ బాగున్నట్లు అనిపించదు. కాంగ్రెస్ లోనే “అపనమ్మకాన్ని”చూడవచ్చు అని ఇవాళ కేరళ కాంగ్రెస్ నేత పీసీ చాకో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.