CAA నిరసనలు : నిన్న ఢిల్లీ..నేడు చెన్నై రేపు ? 

  • Published By: madhu ,Published On : February 17, 2020 / 12:19 PM IST
CAA నిరసనలు : నిన్న ఢిల్లీ..నేడు చెన్నై రేపు ? 

చెన్నై మరో షాహీన్ బాగ్ అవుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను, నిరసనలను స్పూర్తిగా తీసుకున్న చెన్నైకి చెందిన ఓ వర్గానికి చెందిన ప్రజలు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC) వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో 50 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న ఆందోనళలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 24/7 నిరసనలు కొనసాగుతున్నాయి.

చెన్నైకి పాకిన నిరసనలు : 
తాజాగా చెన్నైలో వేలాది మంది నిరసనలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలు పాల్గొంటుండడం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. NPR చట్టాన్ని అమలు చేయబోమని వెల్లడిస్తూ…తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు జరుగుతున్న షాహీన్ బాగ్ – వాషర్‌మన్‌లను కలిపి షాహీన్ పేట్‌గా పేరు పెట్టడం జరిగిందని నిరసనకారులు ప్రకటించారు. 

హిందువులు..ముస్లింలు జీవనం :-
హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవిస్తున్నారని, దశాబ్దాలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. బిస్కెట్ తయారీ యూనిట్లు, హార్డ్ వేర్, వస్త్ర దుకాణాలు మొదలైన వ్యాపారాలు నిర్వహిస్తూ..జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఇక్కడ సామరస్యంగా మెలిగామని, అందువల్ల నిరసనకారుల్లో పాల్గొంటున్న వారికి సహాయం చేస్తానని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మహిళ తెలిపింది. 

నిరసన ప్రాంతానికి తుషార్ గాంధీ –
ఆందోళనల్లో పాల్గొంటున్న వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీరు, ఇతర ఆహార పదార్థాలను అందించారు. ఆందోళనకారులకు డబ్బులు అందచేస్తున్న విమర్శలను ఖండించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమీత్ షాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియచేయడం జరుగుతోందన్నారు. ఇక్కడ ఆజాదీ నినాదాలు మారుమోగాయి. నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి మహాత్మాగాంధీ మనువడు తుషార్ గాంధీ వచ్చి సంఘీభావం తెలిపారు. 

శాసనసభలో తీర్మానం చేయాల్సిందే : –
శాసనసభలో తీర్మానం చేసేంత వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని ముస్లిం సంఘాలు తేల్చిచెప్పాయి. ఫిబ్రవరి 19వ తేదీన సచివాలయ ముట్టడి నిర్వహిస్తామని ప్రకటించాయి. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సజ్జా మునుసామి, అజీజ్ మొహ్మద్ స్ట్రీట్‌లలో నిరసనలు చేపట్టారు. స్థానిక వాషర్ మెన్ భారత్ థియేటర్ సమీపంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.

పోలీసుల లాఠీఛార్జీ..ముస్లిం సంఘాల ఆగ్రహం :-
2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం కూడా నిరసనల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే…రాత్రి వరకు ఆందోళనలు కంటిన్యూ అవుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిరసనలకారులపై లాఠీలు ఝులిపించడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాఠీఛార్జీ జరిగిందన్న ప్రచారం దావానంలా వ్యాపించింది. ఆగ్రహానికి గురైన ముస్లిం సంఘాలు..వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కోయంబత్తూరు, మధురై, కడలూరు, తిరప్పూరు, తిరుచ్చి, కన్నియాకుమారి, తూత్తుకుడి, కుంభకోణం, వేలూరు తదితర నగరాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ముస్లిం కుటుంబాలు రాత్రి..పగలు అనే తేడా లేకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మహిళలు, బాల బాలికలు కూడా పాల్గొంటున్నారు. ఇక ఆందోళనల్లో పాల్గొంటున్న వారికి అక్కడే భోజనం వండి పెడుతున్నారు. 

పోలీసు అధికారుల ప్రత్యేక కమిటీ :-
శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు గాను..సీఎం పళనిస్వామి..డీజీపీ త్రిపాఠీతో చర్చలు జరిపారు. ఈ సమయంలోనే సీఎం క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంను గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ కలవడం విశేషం. జరుగుతున్న ఆందోళనలపై ఆరుగురు పోలీసు అధికారులతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. వీరు నిఘా పెట్టనున్నారు. మరి చెన్నైకి పాకిన ఈ ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకుతాయా ? అనేది చూడాలి. 
Read More : NPR రాష్ట్రపతితో మొదలు