అతి త్వరలోనే CAA అమల్లోకి…బీజేపీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 19, 2020 / 07:17 PM IST
అతి త్వరలోనే CAA అమల్లోకి…బీజేపీ చీఫ్

CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడేందుకు వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో పర్యటిస్తున్నారు జేపీ నడ్డా.



ఈ సందర్భంగా సిలిగురిలో ఓ ర్యాలీలో నడ్డా మాట్లాడుతూ…CAA అమలుకు పార్టీ కట్టుబడి ఉంది. అందరూ దాని లబ్దిని పొందుతారు. కరోనా కారణంగా సీఏఏ అమలులో ఆలస్యం జరిగింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నందున పని ప్రారంభమైంది..రూల్స్ ని ఫ్రేమ్ చేస్తున్నారు. అతి త్వరలో సీఏఏ అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు జేపీ నడ్డా. విభజించి..పాలించు పద్దతి పద్దతిలో మమత ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. టీఎంసీలా కాకుండా అందరికీ అభివృద్ధి కావాలని బీజేపీ వర్కర్స్ కోరుకుంటున్నారన్నారు.



కాగా, డిసెంబర్-31,2014కి ముందు పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లింలకు తప్ప హిందువులకు,సిక్కులకు,బౌద్ధులకు,జైనులకు,పార్శీలకు,క్రిస్టియన్లకు భారతీయ సిటిజన్ షిప్ ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని డిసెంబర్-11,2019న పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే.



అయితే, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు సీఏఏని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్,ఢిల్లీలో అయితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళనల కారణంగా ప్రాణనష్టం,ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వంటి దాడులకు పాల్పడటంతో పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.