పౌరసత్వ సవరణ బిల్లు…తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 10:26 AM IST
పౌరసత్వ సవరణ బిల్లు…తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం.

– అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు?
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు) ఆరేళ్లుగా భారత్‌ లో స్థిర నివాసం ఉంటే, వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్ఛే ముస్లిమేతర శరణార్ధులకందరికీ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ బిల్లును ఉద్దేశించారు. తమ దేశాల్లో మత సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారికి ఈ దేశంలో ఇక పౌరసత్వం లభిస్తుందన్న మాట.

-ప్రభుత్వం ఏం చెబుతోంది:
మంగళవారం(డిసెంబర్-3,2019)బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ ఈ బిల్లుపై ఓ క్లారిటీ ఇచ్చారు. వివాదాస్పదంగా ఉన్న చట్టాలు ప్రభుత్వం యొక్క టాప్ ప్రియారిటీ అని ఆయన సృష్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దుని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పాక్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, ఇస్లామిక్ దేశాల్లోని నాన్-ముస్లిములు మత సంబంధమైన చిక్కులను ఎదుర్కొని ఈ దేశానికి శరణార్థులుగా చేరుకున్న పక్షంలో వారికి భారత పౌరసత్వం లభిస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. సర్వ ధర్మ సంభవ్ స్ఫూర్తితో మోడీ సర్కార్ ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

-ప్రతిపక్షం ఏం చెబుతోంది:
దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు,మరికొందరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఆరు మతాలను మాత్రమే బిల్లులో చేర్చారని,ముస్లింలను వదిలేశారని అంటున్నారు. మతాలతో సంబంధం లేకుండా చట్టాన్ని సెక్యులర్‌గా రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ దేశాల్లో వేధింపులకు గురై భారత్‌కు శరణు కోరి వచ్చిన వారందరికీ బిల్లును వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ,ఆప్ వంటి పార్టీలు అసలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

-కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
అక్రమ వలసదారులతో స్వదేశీ సంస్కృతికి ముప్పు పొంచి ఉందని కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయ్ అని హెచ్చరించారు. ఈ బిల్లు వస్తే పెద్ద సంఖ్యలో గిరిజనులకు హాని చేకూరుస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తొలిసారిగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించింది. అయితే ఈశాన్య రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యతిరేకత వ్యక్తం అవడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.

-ముస్లింలకు నష్టమా?
పాకిస్తాన్ లో వివక్షకు గురైన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షియాలు, అహ్మదీయులకు ఈ ప్రతిపాదించిన బిల్లులో చోటు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు వలసదారులు 11 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్నట్లయితే వారికి భారత పౌరసత్వం ఇవ్వాలని ఉండగా…దాన్ని ఆరేళ్లకే తగ్గిస్తూ కేంద్ర తాజాగా సవరణలు చేసింది.

-NRCకి,పౌరసత్వ బిల్లుకి సంబంధం ఏంటీ?
పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు పౌరసత్వ బిల్లు రక్షణ కల్పిస్తుండగా… ఎన్‌ఆర్‌సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా భారత్‌కు మార్చి 24, 1971 తర్వాత వచ్చి స్థిరపడ్డ అక్రమవలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా రూపొందించారు. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి తమ దేశాలకు పంపే ప్రయత్నం చేస్తోంది కేంద్రం.