Modi Strain : మోడీ స్ట్రెయిన్..కాంగ్రెస్ టూల్ కిట్ తో ప్రధాని ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారన్న బీజేపీ

కరోనా రెండో దశ ఇప్పుడు భారతదేశానికి ఊపిరాడకుండా చేస్తోంది.

Modi Strain : మోడీ స్ట్రెయిన్..కాంగ్రెస్ టూల్ కిట్ తో ప్రధాని ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారన్న బీజేపీ

Modi Strain

Modi strain కరోనా రెండో దశ ఇప్పుడు భారతదేశానికి ఊపిరాడకుండా చేస్తోంది. కరోనా కట్టడి విషయంలో కాంగ్రెస్‌- బీజేపీ మధ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే,కరోనా మ‌హ‌మ్మారిని అడ్డం పెట్టుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రతిష్ఠను దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని తాజాగా కాషాయ పార్టీ ఆరోపించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుందని విమర్శించింది.

కోవిడ్ కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ మ్యటెంట్ స్ట్రెయిన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మీదుగా ‘మోడీ స్ట్రెయిన్‌’ అని కాంగ్రెస్‌ పేరు సృష్టించిందని.. దీంతోపాటు కరోనా వ్యాప్తికి హరిద్వార్ లో గత నెలలో నిర్వహించబడిన కుంభమేళా కూడా కారణంగా చెబుతూ ‘సూపర్‌ స్ప్రెడర్‌ కుంభ్‌’ అని కాంగ్రెస్‌ కొత్త నినాదం తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపించింది. భార‌త్ లో క‌రోనా వేరియంట్ ను మోడీ స్ట్రెయిన్ గా పిల‌వాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ నేత‌ల‌తో పాటు రాహుల్ గాంధీ సూచిస్తున్నార‌ని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రధాని పేరును నాశనం చేయడానికి కాంగ్రెస్ ‘టూల్‌కిట్’ రూపొందించినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ సహా పలువురు బీజేపీ నేతలు ట్వీట్ లు చేశారు. టూల్‌కిట్ అని పిలవబడే పార్టీ కార్యకర్తలను మోడీ పేరు చెడగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని కాంగ్రెస్‌ చెబుతోందని ఆ ట్వీట్ లలో బీజేపీ నేతలు ఆరోపించారు.

అయితే, కాంగ్రెస్ ఈ ఆరోపణను కొట్టిపారేసింది. పార్టీ కార్యకర్తలకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సృష్టం చేసింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించింది. బీజేపీ.. ఫేక్ టూల్ కిట్ ను సర్క్యులేట్ చేస్తోందని, తప్పుడు ఆరోపణలు చేస్తోన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ నేత సంబిత్ పాత్రాపై కేసు పెట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ గౌడ ట్వీట్ చేశారు. భారతీయ యువజన కాంగ్రెస్ (IYC) కూడా బీజేపీ ఆరోపణలను ఖండించింది. కాంగ్రెస్ టూల్ కిట్ అంటూ ప్రజావ్యతిరేక బీజేపీ నాయకులు..కాంగ్రెస్ టూల్ కిట్ అంటూ నకిలీ మరియు మార్ఫింగ్ చేసిన ఓ లెటర్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారుని IYC ఆరోపించింది.