బర్డ్‌ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకుతుందా?

బర్డ్‌ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకుతుందా?

Can bird flu virus be transmitted from birds to humans? : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన బర్డ్ ఫ్లూ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు ఈ వైరస్ బారిన పడి గురై మృత్యువాతపడుతున్నాయి.

బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ చేసినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని ప్రముఖ ఢిల్లీ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్‌ తినటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు.

కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గాల్లో ఉన్న వైరస్‌ను పీల్చటం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను తాకి ఆ వెంటనే ముక్కు, కళ్లను ముట్టుకోవటం ద్వారా ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుందని సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది.

దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తల నొప్పి, కళ్లు ఎర్రగా అవ్వటం వంటివి వైరస్‌ లక్షణాలుగా పేర్కొంది. ఇది మామూలు జలుబు లాంటిదేనని, కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదకారిగా మారుతుందని తెలిపింది. గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఎక్కువ నష్టం కలుగుతుందన్నారు.

ఈ వైరస్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మనరీ, క్రిటికల్‌ కేర్‌ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ యాట్‌ పోర్టిస్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జేసీ సూరి మాట్లాడుతూ కోళ్ల ఫారాలలో పనిచేసేవారు పీపీఈ కిట్లు, గ్లోజులు ధరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు కలుషిత ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేసుకోవాలన్నారు.