Infertility: సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం? ప్రభుత్వం సమాధానం!

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వంధ్యత్వం(సంతాన ప్రాప్తి లేకపోవడం) లేదా సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. లేటస్ట్‌గా క్లారిటీ ఇచ్చింది కేంద్రప్రభుత్వం.

Infertility: సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం? ప్రభుత్వం సమాధానం!

Infertility

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వంధ్యత్వం(సంతాన ప్రాప్తి లేకపోవడం) లేదా సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. లేటస్ట్‌గా క్లారిటీ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ విషయంలో వస్తున్న పుకార్లు మరియు గందరగోళాలను తొలగించడానికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రయత్నించింది. వ్యాక్సిన్‌లు వేసుకున్న తరువాత స్త్రీలలో లేదా పురుషులలో వంధ్యత్వానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం అని మంత్రిత్వ శాఖ సామాన్య ప్రజలకు హామీ ఇచ్చింది.

పుకార్లపై ప్రకటన:
కరోనా వ్యాక్సిన్ కారణంగా ప్రజలలో వంధ్యత్వం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. మీడియా నివేదికల నేపథ్యంలో ఇవి మూఢనమ్మకాలేనని వెల్లడించింది ప్రభుత్వం. వ్యాక్సిన్ విషయంలో అటువంటి అపోహలు పెట్టుకోవల్సిన అవసరమే లేదని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. పోలియో మరియు మీజిల్స్-రుబెల్లాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు వేసుకునే సమయంలో కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం జరిగినట్లుగా కేంద్రం చెప్పుకొచ్చింది.

ఈమేరకు ఓ ప్రకటనలో.. అన్ని వ్యాక్సిన్‌లు మొదట జంతువులపై తరువాత మానవులపై పరీక్షించబడుతున్నందున అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవీ సంతానోత్పత్తిని ప్రభావితం చేయవని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పిల్లలలో కరోనా లక్షణాలు కనిపించట్లేదని, చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి బారిన పడిన పిల్లలలో కొద్దిశాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వస్తుందని అన్నారు.