Dead Bodies : మృతదేహంలో కరోనావైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ఇతరులకు వ్యాపిస్తుందా?

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.

Dead Bodies : మృతదేహంలో కరోనావైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ఇతరులకు వ్యాపిస్తుందా?

Dead Bodies

Dead Bodies : కరోనావైరస్ సోకి మరణిస్తున్న వారి మృతదేహాల పట్ల పలువురు అనుసరిస్తున్న ధోరణి ఆవేదనకు గురి చేస్తోంది. రక్త సంబంధీకులు కూడా కరోనాతో మృతి చెందిన తమ సమీప వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించని పరిస్థితి ఉంది. కరోనాతో చనిపోయారని తెలిస్తే కనీసం అటువైపు కూడా వెళ్లడం లేదు. మృతదేహాలను అనాథ శవాల్లా వదిలేస్తున్నారు. దీనికి కారణం.. మృతదేహాల్లో ఉన్న కరోనావైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అనే భయమే. ఇంతకీ కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా?



ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12 నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్‌ బతకలేదని తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అధ్యయనం చేస్తోందని వివరించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్‌ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు.

‘‘కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి శవాలను 100కు పైగా పరీక్షించాం. మృతదేహాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్‌ వచ్చింది. ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే 12 నుంచి 24 గంటల తర్వాత ఆ వ్యక్తి ముక్కు, శరీరంలో వైరస్‌ బతికి ఉండలేదని గుర్తించాం. శవాలను నుంచి వైరస్‌ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువ. అయితే, ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసి వేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్‌ చేయడం వంటివి చేయాలి” అని సూచించారు.



నిజానికి కోవిడ్ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని వారు తేల్చి చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే ఆ తర్వాత అతని శరీరంలో వైరస్ ఉత్పత్తి ఆగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో వైరస్ కేవలం కొన్ని గంటలు మాత్రమే బతికి ఉంటుందని చెబుతున్నారు. అప్పటికే బాడీలోని ఫ్లూయిడ్స్‌లో వైరస్ ఉన్నా దానికి శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాపించే శక్తి ఉండదన్నారు. మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయిన వారి తలను ఒడిలో పెట్టుకుని ఉండటం వంటి చర్యల వల్ల మాత్రమే వైరస్ ఇంకొకరికి సోకే చాన్సుందన్నారు. లేనిపక్షంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మృతదేహాన్ని ఉంచిన జిప్ బ్యాగ్ మూసి ఉంటే వైరస్ సోకే అవకాశం దాదాపు లేదని వారు స్పష్టం చేశారు.

మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని, ఇప్పటికే వైరస్ లక్షణాలు ఉన్నవారు దహన సంస్కారాలలో లేదా ఖనన క్రియల్లో పాల్గొంటే వారి ద్వారా మాత్రమే ఇతరులకు కరోనా వైరస్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారీ సంఖ్యలో జనం ఒకేచోట గుమికూడి ఉండడం, తమకు దగ్గరి వారు చనిపోయిన బాధలో ఒకరిపై మరొకరు పడి ఏడవడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి చర్యల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు.



ఎవరైనా వ్యక్తి కోవిడ్ సోకి మరణిస్తే వైద్యులు.. ఆసుపత్రిలోనే మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేసి తడి వస్త్రాన్ని చుట్టి బంధువులకు ఇస్తున్నారు. వైరస్ బయటకు రాకుండా మృతదేహాన్ని కేవలం ముఖం మాత్రమే కనిపించేలా చేసి అందజేస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. కానీ చాలా మంది కరోనా వైరస్‌కు భయపడి మృతదేహం దగ్గరికి రావడం లేదు. ఆసుపత్రుల్లో అలా అనాథ శవాల్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మృతదేహాలను తీసుకెళ్లిన కొద్దిమంది సైతం సరైన అంత్యక్రియలు నిర్వహించకుండా వారి ఆత్మ ఘోష చెందేలా ప్రవర్తిస్తున్నారు.

కనీస మానవత్వం లేకుండా ట్రాక్టర్, జెసిబిలలో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య వర్గాలంటున్నాయి. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నది వైద్య వర్గాల మాట.