జాతీయ సంక్షోభంలో మౌన ప్రేక్షకుడిలా ఉండలేం

జాతీయ సంక్షోభంలో మౌన ప్రేక్షకుడిలా ఉండలేం

Cant Be Mute Spectator During National Crisis Says Supreme Court

Supreme Court కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరుపుతోన్న సుప్రీంకోర్టు మంగళవారం విచార‌ణ సంద‌ర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా రెండోదశ విజృంభణను జాతీయ సంక్షోభంగా పేర్కొన్న సుప్రీంకోర్టు…ఇలాంటి క్లిష్ట సమయంలో ఓ మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని కోర్టు తెలిపింది. అలాగే హైకోర్టుల్లోని కరోనా అంశాలపై జోక్యం చేసుకోలేమని పేర్కొంది. రాష్ట్రాల్లోని అంశాలపై హైకోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని..వాటికి స‌హాయ‌క పాత్ర‌ను తాము పోషిస్తామ‌ని జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎల్ఎన్ రావ్‌, జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

కొవిడ్ సంక్షోభ నివార‌ణ‌లో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వ‌న‌రుల‌ను వినియోగించ‌డం, వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని అడిగింది. కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని ఈ సంద‌ర్భంగా నిల‌దీసింది. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో దీనిపై కేంద్రానికే పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఇక, ఆక్సిజన్ సరఫరా, వైద్య సౌకర్యాలు, హాస్పిటల్స్ లో బెడ్స్ పెంపు, రెమ్‌డెసివిర్ లభ్యతతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాలపై గురువారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ లభ్యత, రాష్ట్రాల ఆక్సిజన్ అవసరాలు, కరోనా తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు, టీకా లభ్యత వంటి వివరాలు అందించాలని ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. సుమోటో కేసులో అమిసక్ క్యూరీగా సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్త, మీనాక్షి అరోరాలను సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.