ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్…ఆరోగ్య మంత్రి క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2020 / 05:00 PM IST
ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్…ఆరోగ్య మంత్రి క్లారిటీ

దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో‌ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్-3,2020) ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ దీనిపై స్పందించారు

ఢిల్లీ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. దీన్ని సెకండ్‌ వేవ్‌ అనకూడదు. రెండు నెలల పాటు జీరో కేసులు నమోదయ్యి.. ఆ తర్వాత కొత్తగా కేసులు వెలుగు చూస్తే దానిని సెకండ్‌ వేవ్‌ అంటాం. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాకపోతే కేసుల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. దీని గురించి ఆందోళన అవసరం లేదు. ఇక బుధవారం నాడు మరణాల సంఖ్య 0.75శాతంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే 2.5శాతం మంది కరోనా బారిన పడి మరణించారన్నారు.

ప్రస్తుతం పరీక్షల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు . ఒక్కరోజులోనే 30-35 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు . ప్రజలు కూడా మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సత్యేంద్ర జైన్‌ కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,79,569కి చేరగా, మరణాల సంఖ్య 4,481కి చేరింది