బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాను…అమిత్ షా ఆశీర్వాదం అక్కర్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : November 8, 2019 / 01:48 PM IST
బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాను…అమిత్ షా ఆశీర్వాదం అక్కర్లేదు

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం పదవికి ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన అనంతరం శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాత్కాలిక సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 

ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ…మొదటిసారి మేము అబద్దాలు ఆడుతున్నామని ఆరోపణలు వచ్చాయి. ఫడ్నవీస్ నన్ను లయర్(అబద్దాలు చెప్పేవాడు)అన్నాడు. ఫడ్నవీస్,బీజేపీనే అబ్బదాలు చెబుతుంది. ఎవరు అబద్దాలు చెబుతున్నారో ఆర్ఎస్ఎస్ డిసైడ్ అవ్వాలి. ఎన్నికల ముందు అమిత్ షా,ఫడ్నవీస్ మా ఇంటికి వచ్చారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లలేదు. మీకు ఏం కావాలి అని షా అడిగారు. 50:50 ఫార్ములాని ప్రతిపాదించాను. అమిత్ షా దానికి ఒప్పుకున్నారు. వాళ్లు చెప్పింది ఒప్పుకునేవరకు వారితో మాట్లాడను. అబద్దాలు చెప్పే వాళ్లతో కలిసి పనిచేయలేము. శివసేన వ్యక్తిని సీఎం చేయడానికి అమిత్ సా,ఫడ్నవీస్ ఆశీర్వాదం అక్కర్లేదు. ప్రజలకు ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేదు. ప్రజలకిచ్చిన మాట శివసేన నిలబెట్టుకుంది. ఒక రోజు శివసేన ముఖ్యమంత్రి ఉంటారు అని తాను బాలాసాహెబ్‌(బాల్ ఠాక్రే)కు వాగ్దానం చేశానని, ఆ వాగ్దానాన్నినెరవేరుస్తానని ఉద్దవ్ తెలిపారు. దాని కోసం అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ తమకు అవసరం లేదు.

గంగానది క్లీనింగ్ చేస్తున్న సమయంలో బీజేపీ మనస్సు కలుషితం కావడం చాలా విచారకరమన్నారు. తాము తప్పుడు వ్యక్తులతో పొత్తు పెట్టుకున్నామని తాను బాధపడ్డానని ఉద్దవ్ అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు.

బీజేపీతో చర్చలకు తాము ఎప్పుడూ తలుపులు మూసివేయలేదన్నారు. బీజేపీ తమకు అబద్దాలు చెప్పింది కాబట్టి వారితో మాట్లాడలేదన్నారు. తనను లయర్ అని పిలిచిన వాళ్లతో మాట్లాడే సమస్యే లేదని ఉద్దవం తెగేసి చెప్పారు. తాము ఇంకా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో చర్చలు జరపలేదని ఉద్దవ్ అన్నారు. మహారాష్ట్రలో త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఉద్దవ్ సవాల్ విసిరారు. ప్రతి పార్టీకి వారి స్వంత కలయికను ఏర్పరచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని సేన చీఫ్ అన్నారు.

భాగస్వామిగా ఉంటూ బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన ఆరోపణలు చేసిందని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఉద్దవ్ ఈ సందర్భంగా ఖండించారు.  తామెప్పుడూ ప్రధానిపై మాటల దాడికి దిగలేదన్నారు. తాను మాట్లాడినదానికన్నా ఎక్కువగా హర్యాణా ఎన్నికల సమయంలో మోడీపై మాటల దాడి చేసిన దుష్యంత్ చౌతాలాతోనే బీజేపీ చేతులు కలిపి ఆయనను డిప్యూటీ సీఎం చేశారని ఉద్దవ్ అన్నారు.