3నెలల గ్యాప్ తర్వాత: సీబీఐ ఆఫీసులో అలోక్ వర్మ

3నెలల గ్యాప్ తర్వాత: సీబీఐ ఆఫీసులో అలోక్ వర్మ

77రోజుల గ్యాప్ తర్వాత బుధవారం(జనవరి 9,2019) సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు. సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ఉన్న మన్నె నాగేశ్వరరావు అలోక్ వర్మకు స్వాగతం పలికారు. పరస్సర అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రప్రభుత్వం  సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ డైరక్టర్ రాకేష్ ఆస్తానాలను గతేడాది అక్టోబర్ లో అర్థరాత్రి సెలవుపై పంపించి తెలంగాణకు చెందిన మన్నె నాగేశ్వరరావుని తాత్కాలిక సీబీఐ డైరక్టర్ గా నియమించింది.

సీబీఐ ప్రధానకార్యాలయంలోని 10వ అంతస్థులోని వర్మ ఆఫీస్ కు తాళం వేశారు.అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ అలోక్ వర్మను సీబీఐ డైరక్టర్ గా తిరిగి నియమించాలని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాని నేతృత్వంలోని ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన సెలక్ట్ కమిటీ వారం రోజుల్లో వర్మ స్టేటస పై నిర్ణయం తీసుకొనేంతవరకూ సీబీఐ డైరక్టర్ గా వర్మ పాలసీలకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం తెలిపింది. జనవరి 31తో వర్మ రెండేళ్ల పదవీకాలం పూర్తికానుంది

.
అలోక్ వర్మ కేసులో మంగళవారం నాటి సుప్రీం తీర్పు సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీబీఐని ప్రత్యర్థులమీదకు ఉసిగొల్పుతూ సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని పలువురు పత్రిపక్ష నేతలు ఆరోపించారు. అయితే సీవీవీ రికమండేషన్ ప్రకారమే అలోక్ వర్మను డైరక్టర్ పదవి నుంచి తప్పించామని, సుప్రీం తీర్పు ప్రభుత్వం ప్రభుత్వం నడుచుకుంటుదని తీర్పు అనంతరం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.