CBI వెబ్​సైట్​లో హత్రాస్ FIR…వెంటనే తొలగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : October 12, 2020 / 08:19 PM IST
CBI వెబ్​సైట్​లో హత్రాస్ FIR…వెంటనే తొలగింపు

CBI puts Hathras case FIR on website దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు ఎఫ్​ఐఆర్​ను సీబీఐ తన అధికారిక వెబ్​సైట్​లో ఉంచింది. అయితే,ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఉందని గ్రహించిన అధికారులు.. గంటల వ్యవధిలోనే దానిని వెబ్ సైట్ నుంచి తొలగించారు. ఎఫ్​ఐఆర్​లో బాధితురాలు పేరును కనిపించకుండా వైట్​నర్​ తో కొట్టి వేసినప్పటికీ అనవసర వివాదాలకు దారీతీయకుండా పబ్లిక్ డొమైన్ నుంచి దీనిని తొలగించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హత్రాస్ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోన్న విషయం తెలిసిందే.



అత్యాచార, లైంగిక దాడులకు గురైన బాధితుల(మైనర్లతో కూడా కలిపి) ఎటువంటి వివరాలను పోలీసులు పబ్లిక్ డొమైన్ లో బహిర్గతం చేయకూడదని 2018 డిసెంబర్ లో జస్టిస్ మాదన్ బి లోకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. ప్రింట్​, ఎలక్ట్రానిక్​ మీడియాకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, హత్రాస్ బాధితురాలి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను సోమవారం(అక్టోబర్-12,2020) అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ రికార్డు చేసింది. ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్​ పంకజ్​ మిత్తల్, జస్టిస్​ రాజన్ రాయ్​తో కూడిన ధర్మాసనం… తదుపరి విచారణను నవంబర్​ 2కు వాయిదావేసింది. దీంతో హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు నవంబర్​ 2న హైకోర్టులో మరోసారి హాజరు కానున్నారు.



విచారణలో భాగంగా యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏడీజీ(శాంతి భద్రతల విభాగం) సహా.. హాథ్రస్​ జిల్లా పాలనాధికారి(డీఎం), ఎస్పీ తమ వాదనలు వినిపించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొనే మృతదేహానికి రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించామని.. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని కోర్టుకు తెలిపారు డీఎం. ఈ విచారణకు బాధితురాలి తల్లిదండ్రులు సహా ముగ్గురు సోదరులు పటిష్ఠ భద్రతల నడుమ​ లఖ్​నవూ కోర్టుకు హాజరయ్యారు.



ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌ లో సెప్టెంబర్‌ 14న 19 ఏళ్ళ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి తొలుత అలీఘర్‌లో ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్ కి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలు చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్‌ 29న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.