ఆ రాష్ట్ర మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

ఆ రాష్ట్ర మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

ల్యాండ్ స్కామ్ కేసులో హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇంట్లో ఈ రోజు(జనవరి 25,2019) ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ, దాని చుట్టుపక్కన ఏరియాల్లోని 30కిపైగా ప్లేస్ లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారుల బృందం ఈ రోజు ఉదయం రోహతక్ లోని హుడా ఇంట్లో సోదాలు చేసింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కి పబ్లిషర్ గా ఉన్న అసోయేటెడ్ జర్నల్ కి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద హుడా ల్యాండ్ కేటాయించడంలో జరిగిన అవకతవకలపై 2016లో హర్యానా విజిలెన్స్ బ్యూరో మొదట విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది.

2005లో పంచకులలో అసోసియేటెడ్ జర్నల్ కి ల్యాండ్ తిరిగి కేటాయించడం ఆ ల్యాండ్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడం అక్రమమని సీబీఐ తేల్చింది. మొదటిగా  1982లో హర్యానా ప్రభుత్వం అసోసియేటెడ్ జర్నల్ కి   ల్యాండ్ కేటాయించింది. ఆ తర్వాత 1996లో ల్యాండ్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని   ప్రభుత్వం ఆ ల్యాండ్ ను స్వాధీనం చేసుకొంది. అయితే ఆ తర్వాత హుడా 2005లోపంచకులలో తిరిగి అసోయేటెడ్ జర్నల్ కు ల్యాండ్ కేటాయించడం జరిగింది.

 

ఈ కేసులో ఇటీవల సీబీఐ కోర్టు నుంచి హుడాకి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. హర్యానాలోని జింద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి రణదీప్ సుర్జేవాలా తరపున హుడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ఆయన ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించడం హర్యానాలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.