రైతుల పోరాటం వేళ..పంజాబ్, హర్యానా గోడౌన్లలో సీబీఐ సోదాలు

రైతుల పోరాటం వేళ..పంజాబ్, హర్యానా గోడౌన్లలో సీబీఐ సోదాలు

Punjab and Haryana godowns  : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి నిల్వలను సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ చేశారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. నిన్న రాత్రి నుంచి నిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలకు పారామిలటరీ బలగాల సాయం తీసుకుంటున్నారు. సీబీఐ చేస్తున్న దాడుల్లో 20 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన గోడౌన్లు కూడా ఉన్నాయి.

గోడౌన్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయని.,.. ప్రజలతో నేరుగా లావాదేవీలు జరిగే ఇలాంటి ప్రదేశాల్లో అవినీతిని అరికట్టేందుకే సోదాలు జరిపామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం మంది పంజాబ్ నుంచే రైతులు పాల్గొంటున్నారు. ఈ పరిస్థితుల్లో… సీబీఐ దాడులకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు…ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్‌ 124A ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు…దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్‌ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లఖాసిధానాలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ట్రాక్టర్‌ ర్యాలీలో భాగంగా ఘజీపూర్‌ సరిహద్దు నుంచి బయలుదేరిన ఆందోళనకారులు ఆదాయపు పన్ను కార్యాలయ కూడలికి చేరుకొని పోలీసులతో ఘర్షణకు దిగారు. అనంతరం పోలీసుల వలయాన్ని ఛేదించుకొన్న ఆందోళనకారులు, ఎర్రకోటకు చేరుకొని అక్కడ జెండా ఎగరవేశారు. హింసాత్మక సంఘటనలతో పాటు ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, వీటి దర్యాప్తులపై ఢిల్లీ పోలీసులకు పలు సూచనలు చేసింది.