మమత మేనల్లుడు ఇంటికి సీబీఐ..బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ భార్యకు సమన్లు

మమత మేనల్లుడు ఇంటికి సీబీఐ..బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ భార్యకు సమన్లు

CBI team వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ నివాసానికి ఆదివారం ముగ్గు సభ్యుల సీబీఐ బృందం వెళ్లింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా కు నోటీసులు అందజేసేందుకు సీబీఐ బృందం కోల్ కతాలోని అభిషేక్ ఇంటికి వెళ్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్రమ బొగ్గు తవ్వకాలు, ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ కు చెందిన కనుస్టోరియా, కజోరియా బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు చోరీ తదితర ఆరోపణలు రుజిరా నరులాపై ఉన్నాయి.

ఈ కేసుపై సీబీఐ గత ఏడాది డిసెంబర్ నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ..పరువునష్టం కేసులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను వ్యక్తిగతంగా కానీ, లాయరు ద్వారా కానీ ఈనెల 22న హాజరు కావాలంటూ బెంగాల్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు చేసిన మరుసటి రోజే సీబీఐ అభిషేక్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు.

బొగ్గు స్మగ్లింగ్ కేసులో సీబీఐ ఇటీవల 13 ప్రాంతాల్లో దాడులు జరిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నతరుణంలో సీబీఐ టీమ్ అభిషేక్ బెనర్జీ ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ కేసుపై సీబీఐ గత ఏడాది దర్యాప్తు ప్రారంభించింది.

బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ నేతలకు కోల్ మాఫియా రెగ్యులర్ గా ముడుపులు అందజేస్తోందని, పార్టీ యువజన నేత వినయ్ మిశ్రా ద్వారా ఈ చెల్లింపులు జరిగేవని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో లింక్ ఉన్నట్టు భావిస్తున్న వినయ్ మిశ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికోసం సీబీఐ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

కాగా, 2018 ఆగస్టు 11న కోల్‌కతాలో జరిగిన బీజేపీ ర్యాలీలో తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు అమిత్‌షా చేశారంటూ అభిషేక్ పరువునష్టం కేసు వేసిన విషయం తెలిసిందే.