డేట్ ఫిక్స్ చేసుకుని చర్చలకు రండి, రైతు సంఘాలకు కేంద్రం లేఖ

డేట్ ఫిక్స్ చేసుకుని చర్చలకు రండి, రైతు సంఘాలకు కేంద్రం లేఖ

Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధమని ఆ లేఖలో వివరించారు. తేదీని ఖరారు చేసుకుని రావాలని కేంద్రం సూచించింది. వ్యవసాయ చట్టాలను (agri laws) వ్యతిరేకిస్తూ..గత కొన్ని రోజులుగా రైతన్నలు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 20వ తేదీన కేంద్రం లేఖ రాసింది. చర్చలకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

నిర్మాణాత్మకమైన అంశాలతో చర్చలకు పిలవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా..పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ సవరణ బిల్లుల్లో సబ్సిడీ అంశాలు, పంట వ్యర్థాల దహనానికి సంబంధించిన లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై తాజాగా..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రమోషన్, ఫెసిలిటేషన్) చట్టం – 2020, అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ యాక్ట్ – 2020, ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్ మెంట్) యాక్ట్ – 2020తో ఒక్కసారిగా రైతుల్లో అలజడి ప్రారంభమైంది.

పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి భారీగా రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్దకు ఢిల్లీ చలో పేరిట కార్యక్రమం నిర్వహించారు. వీరిని సరిహద్దులోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఉద్యమానికి ఢిల్లీ ప్రభుత్వంతో పాటు తదితరులు మద్దతు పలికారు. ఇటీవలి కాలంలో ఎన్నడు లేనంత తీవ్రస్థాయిలో ఈ రైతు ఉద్యమం సాగుతోంది. రైతు సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది కేంద్రం. కానీ..ఏ దశలోనూ చర్చలు ఫలప్రదం కాలేదు. సవరణలు వద్దని, చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. తాజాగా రాసిన లేఖపై రైతు సంఘాల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.