కరోనా వాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్

కరోనా వాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్

Covid-19 Vaccination : కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలా అందించాలనేదానిపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు… ఈనెల 28, 29న టెస్ట్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఏపీలో కృష్ణా జిల్లా డ్రై రన్‌కు ఎంపికైంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం ప్లాన్స్ సిద్ధమయ్యాయి. సంసిద్ధతను పరిశీలించేందుకు, లోటుపాట్లను సవరించేందుకు వచ్చే సోమ, మంగళవారాల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తోంది కేంద్రం. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మొదట ఏపీ, పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఈ నాలుగు రాష్ట్రాల్లోని ఏవైనా రెండు జిల్లాల్లో ఐదేసి ప్రాంతాలను ఎంపిక చేసి కరోనా వాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తారు. ఒక్క జిల్లాలో ఐదు ప్రాంతాల చొప్పున.. మొత్తం 50 ప్రాంతాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని కృష్ణా జిల్లాను ఎంపికచేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా యంత్రాంగాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో ఐదు చోట్ల వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

రెండ్రోజుల పాటు జరిగే డ్రైరన్‌లో వ్యాక్సిన్ ఇవ్వడం మినహా మిగిలిన అన్ని దశలను పరిశీలిస్తారు. కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్వహణ, వ్యాక్సిన్‌ రవాణా ఏర్పాట్లు, సామాజిక దూరం పాటించే విధానం, డాటా ఎంట్రీ, రిపోర్టింగ్‌, మాక్‌ డ్రిల్‌, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి స్లిప్‌ అందచేయడం వంటివి నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి దానికి తగ్గట్లుగా ప్లాన్లోల మార్పులు చేర్పులు చేస్తారు.

వాక్సిన్ డెలివరీ ప్రాసెస్ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పలు అంచెల నిర్వహణ వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో మూడు రకాల కమిటీలు ఉన్నాయి. రెండు రాష్ట్ర స్థాయిలో, ఒకటి జిల్లా స్థాయిలో పనిచేస్తాయి. ఈ కమిటీలన్నీ నిత్యం సమావేశమై క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీస్తాయి. కరోనా వాక్సిన్ నిల్వ, డెలివరీ కోసం.. దేశవ్యాప్తంగా 29వేల కోల్డ్ చైన్ పాయింట్లు, 240 వాక్సిన్ కూలర్స్, 70 వాక్సిన్ ఫ్రీజర్స్, 45వేల ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, 41వేల డీప్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్స్ అందుబాటులోకి తెస్తున్నారు. సంబంధిత రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ సామాగ్రిని తరలించారు. వాక్సినేషన్‌కు అవసరమైన సామాగ్రి చేరుకోవడంతో మిగతా ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఏడువేలమందికి వ్యాక్సిన్‌ శిక్షణ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్ మొదలు కావొచ్చని భావిస్తున్నారు.