Masks At Home : ఇంట్లోనూ మాస్కులు ధరించాలి..అవసరమైతే తప్ప బయటికి రావద్దు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.

Masks At Home : ఇంట్లోనూ మాస్కులు ధరించాలి..అవసరమైతే తప్ప బయటికి రావద్దు

Masks At Home

Medical Health Department alert : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది. ఇంటికి బంధువులు, స్నేహితులను ఆహ్వానించవద్దని స్పష్టం చేసింది. ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు నీతి అయోగ్‌ సభ్యులు వీకే పాల్‌. కరోనా రోగి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటే భౌతిక దూరంతో పాటు కుటుంబ సభ్యులు మాస్క్‌ ధరించాలని స్పష్టం చేసింది.

ఒకవేళ భౌతిక దూరం పాటించినా… మాస్క్‌ పెట్టుకోకపోతే 90 శాతం రిస్క్‌ ఉంటుందన్నారు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్. కరోనా సోకినా భయపడవద్దని…. బాధితులు వైద్యుల సలహా మేరకే ఆసుపత్రిలో చేరాలన్నారు… చాలా మంది భయాందోళనతో ఆసుపత్రులలో చేరుతున్నారని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో సరిపడా ఆక్సిజన్‌ ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచడం జరిగిందని…అయితే ఆక్సిజన్‌ రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించింది. రెమిడెసివిర్‌ మందు కోసం దేశంలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. రెమిడెసివిర్‌ కరోనాకు సంజీవినిగా భావించడం పొరపాటన్నారు. కోవిడ్‌ 19 సోకిన ప్రారంభంలోనే రెమిడెసివిర్‌ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంది.

గ‌త వారం రోజుల‌కుపైగా ప్రతిరోజూ మూడు ల‌క్షలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర, ఉత్తర‌ప్రదేశ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వ‌ర‌కు 14కోట్ల 19లక్షల డోసుల వ్యాక్సిన్‌ల పంపిణీ పూర్తయ్యింద‌ని కేంద్రం తెలిపింది.