భయపడొద్దు.. మీ బిడ్డకు హాని చేయను…కేంద్ర మంత్రి హామీ

  • Published By: chvmurthy ,Published On : September 21, 2019 / 11:04 AM IST
భయపడొద్దు..  మీ బిడ్డకు హాని చేయను…కేంద్ర మంత్రి హామీ

తనపై దాడిచేసిన విద్యార్ధిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకోనని, భయపడవద్దని ఆ విద్యార్ధి తల్లికి కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ….రెండు రోజుల క్రితం కోల్‌కతా లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ  కొందరు విద్యార్ధులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ  తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ​ నెలకొన్నాయి.

ఉద్రిక్తల మధ్య సెమినార్ పూర్తి చేసుకుని వెళుతున్న కేంద్ర మంత్రి  కారును విద్యార్ధులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒక విద్యార్ధి  కేంద్ర మంత్రి సుప్రియో పై దాడి చేసి జుట్టు పట్టుకు లాగాడు. ఆ ఫోటోను బాబుల్‌ సుప్రియో ట్విటర్‌లో షేర్‌ చేశారు. సదరు విద్యార్థి పేరు దేబంజన్‌ బల్లవ్‌గా ఆయన పేర్కొన్నారు. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  వైరలయ్యాయి. దాంతో దేబంజన్‌ తల్లి రూపాలి బల్లవ్‌ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిని ఏం చేయవద్దంటూ కేంద్ర మంత్రని కోరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఏం తెలియదు. చిన్నపిల్లవాడు. దయచేసి నా కుమారుడిని ఏం చేయవద్దు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంది.

ఈ విషయం బాబుల్‌ సుప్రియో దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ‘ఆంటీ దయచేసి మీరు బాధపడకండి. నేను కానీ నా కార్యకర్తలు కానీ మీ కుమారుడికి ఎలాంటి హాని చేయం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయం. మీ కుమారుడు తను చేసిన తప్పు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతడి ఫోటోలు షేర్‌ చేశాను. మీ కుమారుడి గురించి ఆందోళన చెందకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ సుప్రియో ట్వీట్‌ చేశారు.