కోవిడ్ వ్యాక్సినేషన్ 3వేల 6ప్రదేశాల్లో ఒకేసారి.. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే

కోవిడ్ వ్యాక్సినేషన్ 3వేల 6ప్రదేశాల్లో ఒకేసారి.. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే

Covaxin : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు దేశం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో వ్యాక్సినేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తొలి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వనుంది ప్రభుత్వం. శనివారం ఉదయం 10 గంటలకు వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3 వేల 6 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

కొవిన్ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులు పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షణతో పాటు, ఈ ప్రక్రియ కోసం 1075 నెంబర్‌తో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేయనున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్‌లో గర్భవతి, బాలింతలను భాగం చేయలేదని.. లబ్ధిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఏ టీకా అయితే మొదటి డోసు తీసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే…. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి టీకా వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.

కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ సోకకుండా అడ్డుకుంటాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్‌ సోకిన రోగులకు టీకా వేయరు.