CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!

కొవిన్ అనే సర్వీసును యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో చేర్చనుంది కేంద్రం. కరోనా టీకాల నిమిత్తం అమల్లోకి తీసుకొచ్చిన ‘కొవిన్‌’ పోర్టల్‌ను స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించింది కేంద్రం. కొవిడ్‌ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్‌లనూ జారీ చేస్తోంది.

CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!

Cowin

CoWIN:  కొవిన్ అనే సర్వీసును యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో చేర్చనుంది కేంద్రం. కరోనా టీకాల నిమిత్తం అమల్లోకి తీసుకొచ్చిన ‘కొవిన్‌’ పోర్టల్‌ను స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించింది కేంద్రం. కొవిడ్‌ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్‌లనూ జారీ చేస్తోంది. ఈ విషయంలో ‘కొవిన్‌’ సమర్థంగా పని చేస్తోన్నందున.. ఈ పోర్టల్‌ను మరిన్ని సేవలకు ఉపయోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

జాతీయ స్థాయిలోని ఇతర వ్యాక్సిన్‌ కార్యక్రమాలకూ దీనిని వినియోగించేందుకు వీలుగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా అన్ని రకాల టీకా వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సులువుగా ఉంటుందని యోచిస్తోంది.

దేశవ్యాప్తంగా చేపడుతున్న యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌(యూఐపీ)తోపాటు కుటుంబ నియంత్రణ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రికార్డులను భౌతికంగానే నిర్వహిస్తున్నారు. ఒక్కసారి కొవిన్‌ను మరింత డెవలప్ చేశాక.. మొత్తం టీకా వ్యవస్థ డిజిటలైజేషన్‌ అవుతుందని కొవిన్‌ చీఫ్‌, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సీఈవో డా.ఆర్‌ఎస్‌ శర్మ మీడియాకు వెల్లడించారు.

Read Also : విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్, కొవిన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది

‘దీంతో లబ్ధిదారులను ట్రాక్‌ చేయడం సులభతరమే కాకుండా రికార్డులను సమర్థంగా నిర్వహించవచ్చు. రియల్‌ టైం పర్యవేక్షణ సాధ్యపడుతుంది. అక్కడికక్కడే టీకా సర్టిఫికెట్‌లు, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ధ్రువపత్రాలు డిజీ-లాకర్లలోనూ నిల్వ ఉంటాయి’ అని వివరించారు.

‘యూఐపీ’ అనేది ఆయా వ్యాధుల నుంచి పిల్లలు, గర్భిణులను రక్షించేందుకు భారత్‌లో నిర్వహించే టీకా కార్యక్రమం. పోలియో, ధనుర్వాతం, తట్టు, హెపటైటిస్- బీ వంటి 12 వ్యాధులకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోంది.