సోషల్ మీడియాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్, ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం

సోషల్ మీడియాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్, ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం

OTT and Digital Platforms : భారత్‌లో సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతో పాటు ఓటీటీల్లో పెట్టే సమాచారానికి అసలు బాధ్యులెవరో నిర్ణయించే అవకాశం ఉంటుంది. అప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ మీడియాను సురక్షితంగా మార్చేలా కేంద్రం చర్యలు తీసుకొంది. ఫేక్ న్యూస్ పై కేంద్రం ఉక్కుపాదం మోపే విధంగా అడుగులు వేసింది. 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు.  సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు ఉండాలని, అభ్యకర పోస్టులను తక్షణం గుర్తించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇతరులను అగౌరవపరిచే రాతలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

నిబంధనలు :
చట్టాలు పాటించేలా చర్యలు తీసుకొనే అధికారి దేశంలో ఉండాలి. చట్టానికి సహకరించే అధికారం దేశంలో ఉండాలి. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే అధికారం కూడా దేశంలోనే ఉండాలి. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. సోషల్ మీడియా సైట్లు పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అసభ్య, అసత్య పోస్టులు ఎవరు పెడుతున్నారో గుర్తించే బాధ్యత ఆయా సంస్థలదే. ప్రెస్ కౌన్సిల్ కోడ్ ను డిజిటల్ మీడియా కూడా ఫాలో అవ్వాలి.

అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రజల్లో వ్యాప్తి కాకుండా అడ్డుకట్ట వేసే ఛాన్స్ :-
భారత్‌లో విచ్చలవిడిగా విస్తరించిన సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు సహకరించవు. అందుకే ఐటీ చట్టంలో భారీ మార్పులు చేయడం ద్వారా వీటిపై నియంత్రణ సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఐటీ చట్టంలో చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమల్లోకి తెచ్చే కొత్త నిబంధనల పరిధిలోకి సోషల్ మీడియా సంస్ధలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములను కూడా తీసుకురానున్నారు.

ప్రతి మేసేజ్ ట్రేస్ : –
కేంద్రం తీసుకొస్తున్న ఆంక్షల్లో ప్రధానంగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ అవుతున్న ప్రతీ మెసేజ్‌నూ ట్రేస్‌ చేసేందుకు ఐటీ శాఖకు వీలు కల్పిస్తుంది. అలాగే తమపై వచ్చే ఫిర్యాదులపై సోషల్ మీడియా సంస్ధలు, ఓటీటీలు చర్యలు తీసుకునే సమయాన్ని 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గిస్తున్నారు. కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇందులో షేర్‌ చేసే కంటెంట్‌ను సెన్సార్‌ చేసే అవకాశం కూడా కలుగుతుంది. తద్వారా అనుచితమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రజల్లోకి సులువుగా వ్యాప్తి కాకుండా అడ్డుకట్ట పడుతుంది.