Hospital Admission : కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందే.. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కేంద్రం ఆదేశం

ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్లడించింది.

Hospital Admission : కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందే.. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కేంద్రం ఆదేశం

Hospital Admission

Hospital Admission : ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్లడించింది. అంతేకాదు ఏ కారణంగానైనా రోగులకు వైద్య సేవలు నిరాకరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కొవిడ్‌ బాధితుల సౌకర్యార్థం నేషనల్ పాలసీ ఫర్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ కొవిడ్‌ పేషెంట్స్‌ విధానంలో కేంద్రం పలు సవరణలు చేసింది. ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

నూతన మార్గదర్శకాలు:
* కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్‌ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.
* కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.
* వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించ లేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.
* అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్‌ అవసరం లేని వారిని డిశ్చార్జ్‌ చేయాలి.

ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ఒక్కరోజే 4వేలకు పైగా మరణాలు:
దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. శుక్రవారం(మే 7,2021) ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది.

ఇదే సమయంలో 4వేల 187 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,38,270 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.95శాతంగా ఉంది.

ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.