విదేశాల్లో కూడా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2019 / 02:58 PM IST
విదేశాల్లో కూడా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ

అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (spg)రక్షణ నిబంధనలను కేంద్ర హోం శాఖ సవరించింది. వరించిన నిబంధనల ప్రకారం ఇక నుంచి వీవీఐపీల ‘రహస్య’ పర్యటనలకు కళ్లెం పడే అవకాశాలున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం… విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు వారు ఏ సమయంలో ఎక్కడకు వెళ్లినా ఎస్‌పీజీ సిబ్బంది వారి వెన్నంటే ఉంటారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంబోడియా పర్యటనకు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఎస్పీజీ నిబంధనలను ప్రభుత్వం సవరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
  
ఎస్పీజీలో 3 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. బెదిరింపు అవగాహన ఆధారంగా ఈ ప్రత్యేక బృందం ప్రధానమంత్రులతో పాటు మాజీ ప్రధానమంత్రులు మరియు వారి కుటుంబాలను కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు కొనసాగుతోంది. 

అయితే గాంధీ కుటుంబీకులు ఇటీవల వరకూ విదేశీ పర్యటనలు వెళ్లినప్పుడు తాము వెళ్లాల్సిన మొదటి లొకేషన్ వరకూ ఎస్పీజీ రక్షణతో వెళ్తుండటం, ఆ తర్వాత ఎస్పీజీని వెనక్కి పంపేసి తాము ఎంపిక చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వస్తుండటం జరుగుతోందని, దీంతో వారికి భద్రతాపరమైన ప్రమాదం ఉందని కేంద్రం అనుమానిస్తున్నట్టు సమాచారం. 

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. గాంధీ కుటుంబం ఇప్పుడు వారి ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఎస్‌పీజీ రక్షణ పొందుతున్న వీవీఐలకు ఆమోదయోగ్యం కాకపోతే, భద్రతా కారణాల రీత్యా వారి విదేశీ పర్యటనలకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని విదేశీ పర్యటనల సమాచారాన్ని ఇవ్వాలని గాంధీ కుటుంబీకులను కేంద్రం కోరినట్లు సమాచారం.  

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానుల భద్రత కోసం 1985లో ఎస్పీజీ వ్యవస్థ ఏర్పాటు అయింది. అయితే 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు,వారి కుటుంబాలకు  10ఏళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించే విధంగా ఎస్పీజీ చట్టానికి సవరణ చేశారు. అయితే 2003 లో మాజీ ప్రధాని వాజ్ పేయి…10ఏళ్ల నుంచి ఒక ఏడాదికి లేదా కేంద్రం నిర్ణయించిన ముప్పు స్థాయిని బట్టి ఇచచేలా ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించేలా చట్టానికి మరోసారి సవరణ చేశారు.

ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం ఉపసంహరించుకుంది. మన్మోహన్ సింగ్ కి Z + సెక్యూరిటీ కవర్ కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 20ఏళ్ల క్రితం మాజీ ప్రధానులు హెచ్ డీ దేవెగౌడ,వీపీ సింగ్ లకు కూడా ఇదే విధంగా ఎస్పీజీ సెక్యూరిటీని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితమైన  మాజీ ప్రధాని వాజ్ పేయి చనిపోయిన 2018 వరకు ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారు.