Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

అస్సాంలో సంభవించిన వరదల ధాటికి రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. ప్రధానంగా దిమా హసావో జిల్లాలో రైలు నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినింది. బరాక్ మరియు బ్రహ్మపుత్ర లోయను ఇతర రాష్ట్రాలతో కలిపే రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి

Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

Assam

Assam Floods: అస్సాం, కేరళ రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదల ధాటికి అస్సాం రాష్ట్రం అతలాకుతలం అయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకృతి విలయతాండవంతో అస్సాంలో అపార నష్టం వాటిల్లింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్రంలో అక్కడక్కడా రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వరదల ధాటికి విద్యుత్ అంతరాయం ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు అస్సాంలో సంభవించిన వరదల ధాటికి రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. ప్రధానంగా దిమా హసావో జిల్లాలో రైలు నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినింది. బరాక్ మరియు బ్రహ్మపుత్ర లోయను ఇతర రాష్ట్రాలతో కలిపే రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. వరద నష్టంపై ఆదివారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సీఎం హిమంతా బిశ్వ..ఆమేరకు రైల్వే వ్యవస్థ పునరుద్ధరణ నిమిత్తం కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టిందని అన్నారు.

Assam1

రైల్వే లైన్ల పునరుద్ధరణ, ఇతర మరమ్మతుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం బిశ్వ తెలిపారు. దిమా హసావో జిల్లాలో రైల్వే లైన్ ను జులై 10 నాటికి పునరుద్ధరిస్తామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపిందని ఆయన అన్నారు. త్రిపుర, మిజోరాం, మణిపూర్‌ సహా దేశంలోని ఇతర ప్రాంతాలను కలిపే బరాక్ – బ్రహ్మపుత్ర లోయ రైల్వే పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హిమంతా బిశ్వ చెప్పారు. మరోవైపు భారీ వరదల ధాటికి అస్సాంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారని 7.20 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని అస్సాం విపత్తు నిర్వహణశాఖ తెలిపింది.

Assam2

ఆర్మీ, అస్సాం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), ఇండియన్ ఆర్మీ, సివిల్ డిఫెన్స్, పారామిలిటరీ బలగాలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది స్థానిక జిల్లా పరిపాలనా యంత్రాంగంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1.32 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా, మరికొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా తుఫాను బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు కేరళలోనూ భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి నివేదించలేదు. ఇప్పటికే కేంద్ర రక్షణ బృందాలు, విపత్తు నిర్వహణ బృందాలు కేరళలో సహాయక చర్యలు చేపట్టాయి.

other stories:Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్