Unique ID for Plots: మనుషులకే కాదు భూములకు కూడా ఇకపై ఆధార్ నెంబర్

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి స్థలం/ప్లాటుకు ఏడాదిలోగా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

Unique ID for Plots: మనుషులకే కాదు భూములకు కూడా ఇకపై ఆధార్ నెంబర్

Unique Id For Plots

Unique ID for Plots: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి స్థలం/ప్లాటుకు ఏడాదిలోగా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మనుషులకు ఆధార్‌ నంబర్‌ లాగానే భూములకు కూడా 14 అంకెల ప్రత్యేక నంబర్‌ను కేటాయించనున్నారు. భూమి రికార్డుల డేటా బేస్‌ను ఆ తరువాత రెవెన్యూ కోర్టు రికార్డులతో, బ్యాంకు రికార్డులతో అనుసంధానం చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇష్టాయిష్టాలను బట్టి వారి ఆధార్‌ నంబర్‌ను కూడా దీనికి అనుసంధానిస్తారు.

గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం గత వారం లోక్‌సభకు సమర్పించిన రిపోర్టులో ఈ విషయం వెల్లడించింది.

డీఐఎల్‌ఆర్‌ఎంపీ (డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మాడర్నైజేషన్‌ ప్రోగ్రామ్‌)లో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్రం ఈ స్కీంను 2008లో ప్రారంభించింది. ఈ పథకం వచ్చేవారంతో ముగియాల్సి ఉండగా, మరోమారు 2023-24 వరకు పొడిగించింది. భూములు /ప్లాట్లకు కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ‘యూనిక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఎల్‌పీఐఎన్‌/అల్పిన్‌) అని పేర్కొంటున్నారు.

ఈ ప్రక్రియను ఇప్పటికే పది రాష్ట్రాల్లో ప్రారంభించారని, వచ్చే మార్చి నాటికి దేశమంతా చేపట్టనున్నారని భూ వనరుల విభాగం తమకు తెలిపిందని పార్లమెంటరీ స్థాయి సంఘం తన రిపోర్టులో పేర్కొంది. భూ కుంభకోణాలను నివారించేందుకే ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను ఇస్తున్నామని, ఇది ఒకరకంగా భూములకు ఆధార్‌ నంబర్‌ వంటిదని భూ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు.

భూమి రేఖాంశం, అక్షాంశాల సమన్వయం ఆధారంగా, ఇదివరకే ఉన్న సమగ్ర సర్వే నివేదికల ఆధారంగా నంబర్‌ను కేటాయిస్తామని తెలిపారు.